అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ని వైసీపీ నేతలు అవమానించారు. ఆ రోజు చంద్రబాబుతోపాటు, టీడీపీ సభ్యులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతో ఆవేదన చెందారు. ఆ క్రమంలోనే ఈ కౌరవ సభలో ఉండనని, ముఖ్యమంత్రి హోదాలోనే మళ్లీ ఈ సభలో అడుగు పెట్టి దీనిని గౌరవ సభ చేస్తానని చంద్రబాబు శపథం చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. చంద్రబాబు అన్న మాట ప్రకారం అఖండ మెజారిటీతో తన పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి…ముఖ్యమంత్రిగా చంద్రబాబు అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చారు. ‘‘నిజం గెలిచింది…ప్రజాస్వామ్యం గెలిచింది’’ అంటూ టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు.
ఈ క్రమంలోనే తన శపథం నెరవేర్చుకొని గౌరవ సభలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టిన సందర్భంగా ఆయన అర్ధాంగి భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది….ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!” అని భువనేశ్వరి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు గతంలో చంద్రబాబు శపథం చేసిన వీడియో, తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన దృశ్యాల వీడియోను భువనేశ్వరి షేర్ చేశారు.
ఇక, తనయుడు నారా లోకేశ్ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంపై కూడా భువనేశ్వరి స్పందించారు. నా తండ్రి నుంచి నా చిట్టి తండ్రి వరకు అంటూ ఎన్టీఆర్ నుంచి లోకేశ్ వరకు అసెంబ్లీలో తన కుటుంబ సభ్యుల ప్రాతినిధ్యంపై భువనేశ్వరి గర్వంగా పెట్టిన ట్వీట్ వైరల్ అయింది.
“నా తండ్రి నుంచి నా చిట్టి తండ్రి లోకేశ్ వరకు చూసుకుంటే… ప్రజాసేవలోకి మా కుటుంబం నుంచి మూడోతరం రావడం ఆనందంగా ఉంది. తన తండ్రితో పాటు గౌరవ సభలో కూర్చునే అదృష్టం దక్కించుకోవడం పట్ల, అతడి స్వయంకృషి పట్ల చాలా సంతోషంగా, గర్వంగా ఉంది” అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.
ప్రజాసేవలోకి వస్తానని లోకేశ్ అన్నాడని, ఆ ఇష్టాన్ని అతనికే వదిలిపెట్టామని వెల్లడించారు. చిన్న వయసు నుంచి అనేక విమర్శలను ఎదుర్కొని, నేడు తనకు తానుగా అత్యధిక మెజారిటీతో మంగళగిరి నుంచి ఎన్నికవడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా యువగళం పాదయాత్ర ద్వారా చైతన్యం తీసుకువచ్చి, ప్రజలను, కార్యకర్తలను మెప్పించాడని భువనేశ్వరి కొనియాడారు.
నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు!
నిజం గెలిచింది….ప్రజాస్వామ్యం నిలిచింది. ప్రజలకు ప్రణామం!#TeluguAtmaGauravamWins pic.twitter.com/mnyuQu5Pt6
— Nara Bhuvaneswari (@ManagingTrustee) June 21, 2024