టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అన్ని అడ్డంకులు దాటుకుని 200 రోజులు పూర్తి చేసుకుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని యాత్రను భగ్నం చేయాలని వైసిపి నేతలు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో లోకేష్ కదం తొక్కుతూ పాదయాత్రను ముందుకు తీసుకుపోతున్నారు. ఈ నేపద్యంలోనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుండి ఈ రోజు పాదయాత్ర మొదలైంది, పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా లోకేష్ కు సంఘీభావం తెలిపేందుకు నారా భువనేశ్వరితో పాటు హీరో నారా రోహిత్, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు.
సీతంపేట వద్ద 2700 కిలోమీటర్ల మైలురాయిని 200వ రోజు లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడ లోకేష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. టిడిపి కార్యకర్తలు, నేతలపై వైసిపి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులన్నీ టిడిపి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపు ఎత్తివేస్తామని హామీ ఇస్తూ శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. పోలవరం నియోజకవర్గం సీతంపేట వద్ద పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో నారా భువనేశ్వరి కూడా పాల్గొన్నారు. సైకో పాలనపై సమరశంఖం మోగిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా తాను చేపట్టిన పాదయాత్ర సీతంపేట వద్ద 2700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకోవడం సంతోషంగా ఉందని లోకేష్ అన్నారు.
జగన రెడ్డి పాలనలో బాధితులైన ప్రజలకు విముక్తి లభిస్తుంది అన్నారు. ఇక, రక్షాబంధన్ సందర్భంగా లోకేష్ కు రాఖీ కట్టేందుకు మహిళలు క్యూ కట్టారు. 200వ రోజు యువగళం సందర్భంగా లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు ప్రజలు హాజరయ్యారు. లోకేష్ కు హారతినిచ్చి 200వ రోజు పాదయాత్రను మొదలుబెట్టిన భువనేశ్వరి ఆ తర్వాత లోకేష్ చేయి పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు.