మాజీ మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేయబోయి మంత్రి కొండా సురేఖ చిక్కుల్లో పడ్డ సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత, కేటీఆర్ లపై సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారం కోర్టు వరకు చేరింది. సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సురేఖకు సమన్లు జారీ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది.
డిసెంబర్ 12వ తేదీకి ఆ పిటిషన్ తదుపరి విచారణ వాయిదా వేసిన కోర్టు…ఆ రోజు విచారణకు సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగ్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇరు వర్గాల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. నాగార్జున కుటుంబం పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు లాయర్ అశోక్ రెడ్డి వాదించారు.
అయితే, సురేఖ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారని ఆమె తరఫు న్యాయవాది గురు ప్రీత్ సింగ్ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత సురేఖ విచారణకు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.