టాలీవుడ్ యాక్టర్ నాగార్జున కు హైడ్రా బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను ఈ రోజు తెల్లవారుజామున హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారని ఫిర్యాదులు రావడంతో.. దర్యాప్తి చేసిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా గుర్తించారు.
పక్కా ఆధారాలతో హైడ్రా బృందం ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేతపై తాజాగా నాగార్జున స్పందిస్తూ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఆ భూమి పట్టా భూమి.. ఒక్క అంగుళం కూడా తాము కబ్జా చేయలేదని నాగార్జున స్పష్టం చేశారు. పైగా కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగ్ తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నాగార్జున ఒక సుధీర్గ పోస్ట్ పెట్టారు.
`స్టే ఆర్డర్లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.
స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను` అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారడంతో.. మీకు మేము సపోర్ట్ చేస్తాం నాగ్ సార్ అని నెటిజన్లు మరియు అభిమానులు కామెంట్ల మోత మెగిస్తున్నారు.