అక్కినేని నాగార్జున సంక్రాంతి సీజన్ మీద ఇంకా ఆశలు వదులుకున్నట్లుగా లేడు. ఆ పండక్కి రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ‘బంగార్రాజు’ సినిమాను మూడు నెలల కిందట మొదలుపెట్టి చకచకా షూటింగ్ అవగొడుతున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ పూర్తి కావస్తున్న ఈ సినిమాకు గత నెలలోనే ప్రమోషన్లు కూడా మొదలైపోయాయి.
‘బంగార్రాజు’ నుంచి లడ్డుండ పాటతో పాటు కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఐతే సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ మాత్రమే రిలీజవుతాయన్న ధీమాతో నాగ్ తన సినిమాను కూడా రేసులో నిలపాలనుకున్నారు. జనవరి 14న ‘రాధేశ్యామ్’ కూడా రిలీజయ్యాక, తర్వాతి రోజు తన చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనతో ఆయన ఉన్నారు.
తన చిత్రానికి పరిమిత సంఖ్యలో థియేటర్లు దక్కినా చాలనుకున్నారు. ఐతే ‘భీమ్లా నాయక్’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి ఆ చిత్ర మేకర్స్ అస్సలు ఇష్టపడట్లేదు.
జనవరి 12నే ‘భీమ్లా నాయక్’ వస్తుందని కొన్ని రోజుల కిందటే చిత్ర బృందం నొక్కి వక్కాణించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతి నుంచి వాయిదా వేయించేలా పవన్ కళ్యాణ్‌తో సహా చిత్ర బృందాన్ని ఒప్పించడానికి దిల్ రాజు సహా కొందరు సినీ పెద్దలు గట్టిగా ప్రయత్నిస్తున్నా కూడా అటు నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు.
ఇప్పటికైతే ‘భీమ్లా నాయక్’ వాయిదా గురించి ఎలాంటి సంకేతాలు లేవు. అయినా సరే.. నాగార్జున సంక్రాంతిపై ఆశలు వదులుకున్నట్లుగా కనిపించడం లేదు. సినిమా ప్రమోషన్లను కొనసాగిస్తూనే ఉన్నారు. రెండు రోజుల కిందటే సినిమాలో కృతి శెట్టి పోషించిన నాగలక్ష్మి పాత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయగా.. తాజాగా బంగార్రాజు ఫస్ట్ లుక్, టీజర్ అప్డేట్ కూడా ఇచ్చారు.
ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం, టీజర్ మంగళవారం ఉదయం రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి రిలీజ్ విషయంలో తగ్గట్లేదు కాబట్టే నాగ్ ఇలా ప్రమోషన్లు, అప్డేట్స్ ఆపట్లేదని స్పష్టమవుతోంది. మరి ఆయన ఆశలు ఏమేర ఫలిస్తాయో చూడాలి.