నగరిలో మంత్రి రోజాకు చాలాకాలంగా అసమ్మతి సెగ తగులుతోన్న సంగతి తెలిసిందే. ఓ వైపు సొంత పార్టీకి చెందిన నేతలే రోజాకు వ్యతిరేకంగా పలుమార్లు గళం వినిపించారు. రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామని జగన్ కు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా సరే రోజాకు జగన్ టికెట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా రోజాకు జనం నుంచి నిరసన ఎదురైంది. సొంత నియోజకవర్గం నగరిలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది.
బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా రోజాను ప్రజలు నిలదీశారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లిన రోజాను స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు అడ్డుకున్నారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రోజాను ప్రశ్నించారు. ఇపుడు ఎన్నికల ముందు తమ ఓట్లకోసం వచ్చారంటూ రోజా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోజాను ముందుకు వెళ్లనీయలేదు. ఆగ్రహంతో ఉన్న ప్రజలకు సర్ది చెప్పేందుకు రోజా, వైసీపీ నేతలు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. దీంతో, చేసేదేం లేక రోజా ప్రచారం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. మిగతా గ్రామాల్లో కూడా రోజాకు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురయ్యే అవకాశముందని టాక్ వస్తోంది.