ఓ అప్ కమింగ్ డిటెక్టివ్ కు….ఓ డిటెక్టివ్ ఏజెన్సీలో ఉద్యోగం వస్తుంది. తన బాస్ చెప్పిన దాని ప్రకారం ఈ యంగ్ డిటెక్టివ్…ఓ ముగ్గురు వ్యక్తుల ప్రతి కదలికను గమనించి బాస్ కు చేరవేస్తుంటాడు….అనూహ్యంగా ఈ డిటెక్టివ్ వివరాలు సేకరిస్తున్న వారు ఒక్కొక్కరూ రోడ్డు ప్రమాదంలోనో…వేరే ఏదో ఒక ప్రమాదంలోనో చనిపోతుంటారు. అనుమానం వచ్చిన ఈ యంగ్ డిటెక్టివ్…ఆరా తీస్తే అది ఓ బోగస్ డిటెక్టివ్ కంపెనీ అని తేలుతుంది.
అనాథలతో ఎంచుకొని…వారితో పాలసీలు చేయించి….ఆ తర్వాత వారిని రోడ్డు ప్రమాదంలో చంపేసి…ఒక్కో పాలసీకి వచ్చే కోటి రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేస్తుంటుందా ముఠా. ఈ ముఠాలో ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీనే సూత్రధారి అని హీరో తెలుసుకొని…. చివరకు ఓ పోలీసు అధికారి సాయంతో ఆ ముఠా గుట్టు రట్టు చేస్తాడు. తమిళ సినిమా ‘తేగిడి’ తెలుగు వెర్షన్ ‘భద్రమ్’ సినిమా నేపథ్యం ఇది.
అయితే, ‘భద్రమ్’ సినిమా నుంచి స్ఫూర్తి పొందారో ఏమోగానీ…. దాదాపుగా ఇదే తరహాలో తెలంగాణలోని దామరచర్లలో ఓ ముఠా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కృత్రిమ యాక్సిడెంట్లు చేయిస్తూ కోట్లు కొల్లగొట్టింది. ఇటీవల జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు విచారణ సందర్భంగా ఈ ముఠా గుట్టురట్టయింది. ఈ ఉదంతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పాలసీల ముసుగులో ఇలా కూడా చేస్తారా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఈ ముఠా టార్గెట్ చేస్తుంది. వారితో బలవంతంగా బీమా చేయించి…ఒకటి రెండు ప్రీమియంలు కూడా కట్టి నమ్మకం కలిగేలా చేస్తుంది. ఆపై నామినీతో బేరం కుదుర్చుకొని పాలసీదారులను హత్యచేసి బీమా సొమ్మును కొట్టేస్తుంది. ఇలా కాసులకు కక్కుర్తిపడి ఈ ముఠా ఏకంగా ఇప్పటిదాకా ఐదారుగురిని మట్టుబెట్టిన వైనం తెలుసుకొని పోలీసులే షాకయ్యారు.
గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తోందని పోలీసులు గుర్తించారు. బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్మును క్లెయిమ్ చేయడం ఈ ముఠా మోడస్ ఆపరెండి అని వెల్లడించారు. మొత్తం డబ్బులో 20 శాతం నామినీ, కుటుంబ సభ్యులకు ఇచ్చి మిగతా మొత్తాన్నిఆ ముఠా సభ్యులు పంచుకుంటారు.
ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దామరచర్ల మండలంలోని ఓ తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకమని పోలీసులు గుర్తించారు. వారిలో ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఏజెంట్ కోసం గాలిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి యాక్సిడెంట్ వ్యవహారంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు కోటిరెడ్డి భార్య అంగీకరించడంతో ఈ ముఠా గుట్టు బట్టబయలైంది. కాబట్టి పాలసీలు కట్టేముందు….ఇటువంటి ముఠాలబారిన పడకుండా జర ‘భద్రమ్’ గా ఉండండి…. తస్మాత్ జాగ్రత్త.