తెలంగాణలో కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికకు నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపఎన్నిక షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. మునుగోడులో నవంబర్ 3న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించి.. 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉపఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
ఈ నెల 14 వరకు నామినేషన్ల సమర్పణకు గడువు తేదీని ప్రకటించింది. 15న నామినేషన్ల పరిశీలన.. ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. మునుగోడు సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. తక్షణమే మునుగోడులో ఎన్నికల నియమావళి అమలులోకి రానుంది.
మూడు కీలక పార్టీలు.. ఇక్కడ పోటీకి రంగంలోకి దిగాయి. వీటిలో కాంగ్రెస్, టీఆర్ ఎస్, బీజేపీలు.. నేరుగా తలపడనుండగా.. ఒకరిద్దరు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. అదేసమయంలో ప్రజాశాంతి పార్టీ, బీఎస్పీ వంటివి కూడా ఇక్కడ ప్రధానంగా రంగంలోకి దిగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగనుందనే అంచనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే.. ఇప్పటికే.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించగా.. బీజేపీ, టీఆర్ ఎస్లు కన్ఫర్మ్ చేసుకున్నా.. ఇంకాఅధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. కానీ, ప్రచారం మాత్రం నిర్వహిస్తున్నాయి.