పక్కా బాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఉన్న ఈ క్రైం థ్రిల్లర్ అవాక్కు అయ్యేలా చేస్తుంది. రీల్ కు మించిన ఈ రియల్ స్టోరీ ఇప్పుడు సంచలంగా మారింది. అన్నను హత్య చేసినోడికి ప్రేమ వల విసిరి.. అతడ్ని హతమార్చటం ద్వారా తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్న ఒక మహిళ ఉదంతమిది. అయితే.. సక్రమ పద్దతిలో కాకుండా అక్రమ పద్దతిలో కావటంతో అరెస్టు అయ్యింది. సినిమా ట్విస్టులకు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ స్టోరీలోకి వెళితే..
ముంబయిలో గత ఏడాది జూన్ లో వాహనాల పార్కింగ్ విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో 24 ఏళ్ల అల్తాఫ్ ను హత్య చేశాడు సాధిక్. అనంతరం ఢిల్లీకి పారిపోయాడు. సోదరుడు అల్తాఫ్ ను హత్య చేసిన వాడిని అస్సలు వదిలిపెట్టకూడదని.. అతడ్ని కూడా చంపేయాలని డిసైడ్ అయ్యింది హతుడి సోదరి యాస్మిన్. ఇందుకోసం తన అన్న స్నేహితులు సహకరిస్తామని మాటివ్వటంతో మెదడుకు పదును పెట్టింది. ఇన్ స్టా లో నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి.. తన అన్నను చంపిన సాధిక్ కోసం వెతికింది. చివరకు అతడ్ని గుర్తించి.. అతడితో చాట్ చేయటం మొదలు పెట్టింది. ఇదేమీ తెలీని సాధిక్.. యాస్మిన్ ప్రేమలో పడ్డాడు. ఆమెను కలిసేందుకు ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చాడు సాధిక్.
యాస్మిన్ చెప్పిన ప్రాంతానికి వెళ్లిన సాధిక్ ను.. అల్తాఫ్ స్నేహితులు అతడ్ని బంధించి అంబులెన్సులోఎక్కించారు. దీన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.దీంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. అదే సమయంలో అంబులెన్సుకు డీజిల్ అయిపోవటంతో మరో వాహనంలోకి మర్చారు. మొత్తానికి వీరందరిని పోలీసులు పట్టుకున్నారు. కిడ్నాప్ ఎందుకు చేశారు? కారణం ఏమిటి? సాధిక్ కు మిగిలిన వారికి మధ్య గొడవలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతగ్గా.. అన్ని విషయాలు బయటకు వచ్చాయి. దీంతో.. అల్తాఫ్ ను హత్య కేసులో అరెస్టు చేశారు. రీల్ ప్రతీకారాల మాదిరి రియల్ గా సాధ్యం కావన్న విషయాన్ని తాజా ఉదంతాన్ని చూస్తే అర్థం కాక మానదు. ఒకవేళ.. చట్టవిరుద్ధంగా పనులు చేసినా.. పట్టుబడతారన్న విషయాన్ని మర్చిపోకూడదు.