హాలీవుడ్ సూపర్ హీరో ల సినిమాల తరహాలో ఇండియాలోనూ మనదైన సూపర్ హీరోల పాత్రలతో భారీ సినిమాలు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ బాలీవుడ్ ‘క్రిష్’ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే ప్రశాంత్ వర్మ హనుమంతుడి పాత్ర స్ఫూర్తితో ‘హనుమాన్’ తీసి మెప్పించాడు. అదొక ఫ్రాంఛైజీగా మారబోతోంది.
మరోవైపు బాలీవుడ్లో ‘శక్తిమాన్’ పాత్రను వెండి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 90వ దశకంలో టీవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శక్తిమాన్ పాత్ర స్ఫూర్తితో భారీ సినిమా తీయడానికి సోనీ పిక్చర్స్ సంప్రదింపులు జరుపుతోంది. ‘శక్తిమాన్’ టీవీ షో మేకర్స్ నుంచి హక్కులు కూడా తీసుకున్నారు. పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శక్తిమాన్ పాత్రకు రణ్వీర్ సింగ్‌ను అనుకుంటున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది.
ఐతే రణ్వీర్తో ఐకానిక్ శక్తిమాన్ పాత్రను చేయించాలన్న ఆలోచనను ఒకప్పటి శక్తిమాన్ ముకేష్ ఖన్నా తీవ్రంగా వ్యతిరేకించాడు. శక్తిమాన్ అనగానే అందరికీ ముకేష్ ఖన్నానే గుర్తుకొస్తాడు. ఆయన రూపం శక్తిమాన్గానే గుర్తుకు వస్తుంది. తనకు అంత పేరు తెచ్చిపెట్టిన పాత్రను రణ్వీర్ సింగ్ చేస్తాడన్న వార్త ముకేష్‌కు రుచంచలేదు. రణ్‌వీర్‌కు ఉన్న ఇమేజ్‌కు శక్తిమాన్ పాత్ర చేయడానికి తగిన వాడు కాదని ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.
న్యూడ్ ఫొటో షూట్లు చేసే రణ్వీర్.. జనాలు ఎంతో స్ఫూర్తి పొందే శక్తిమాన్ పాత్రను ఎలా చేస్తాడని ముకేష్ ప్రశ్నించాడు. శక్తిమాన్ అంటే ఒక టీచర్ తరహా పాత్ర అని.. జనాలకు ఎంతో మంచిని బోధిస్తుందని.. అలాంటి పాత్రను రణ్వీర్ లాంటి ఇమేజ్ ఉన్న నటుడు చేస్తే తనకు తీవ్ర అభ్యంతరకరమే అని ఆయన ఆ పోస్టులో పేర్కొన్నారు. ఐతే ఈ పోస్టు చర్చనీయాంశం కావడం, రణ్వీర్ అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన దాన్ని తొలగించారు.