సీఎం జగన్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం తాజాగా లేఖ రాశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై పరిశీలన చేయాలని కోరారు. అన్ని వర్గాల వారు తీసుకోగా మిగిలిన రిజర్వేషన్లనైనా తమకు కేటాయించాలని ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు కల్పించడం ద్వారా పేద కాపులకు లబ్ధి చేకూరుతుందని, ఆ దిశగా ఆలోచన చేయాలని జగన్ కు ముద్రగడ విజ్ఞప్తి చేశారు. దివంగత ఎన్టీఆర్, వైఎస్సార్ లను ప్రజలు దేవుళ్ళుగా భావించారని, వారి మాదిరిగానే పేద ప్రజలకు సేవ చేయాలని జగన్ కు ముద్రగడ సూచించారు.
కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపు అన్ని నియోజకవర్గాలలోనూ జగన్ గెలుపు కోసం కాపులంతా గత ఎన్నికల్లో కృషి చేశారని ముద్రగడ గుర్తు చేశారు. ఆ కృతజ్ఞతతో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే మరోసారి జగన్ ను గెలిచేందుకు కాపు జాతి ఉపయోగపడుతుందని ముద్రగడ అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు కాపు జాతి మద్దతు పలికేలా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానంపై దృష్టి పెట్టాలని, కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించేలా కృషి చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కాపులకు రిజర్వేషన్లను ఆర్టికల్ 342A (3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చని కేంద్ర సామాజిక న్యాయ మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఆమె చెప్పారు. రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జగన్ కు ముద్రగడ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అయితే, ముద్రగడ లేఖపై జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.