వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను నరసాపురం పర్యటనకు రాకుండ సీఎం జగన్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే, తన అభిమానులను పోలీసులు ఇబ్బంది పెడుతున్న క్రమంలో రఘురామ తన టూర్ క్యాన్సిల్ చేసుకున్నారు. అయినా సరే, ఆ తర్వాత రఘురామపై హైదరాబాద్ నగర పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో రఘురామ, ఆయన కుమారుడు భరత్, రఘురామ పీఏ శాస్త్రిలతో పాటు సీఆర్పీఎఫ్ కు చెందిన ఏఎస్ఐ, కానిస్టేబుళ్లనూ నిందితులుగా చేర్చారు.
అనుమతి లేకుండా తన ఇంటిపై నిఘా పెట్టిన ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను రఘురామ అనుచరులు అదుపులోకి తీసుకున్నారని కేసు నమోదైంది. అయితే, ఆ కేసు కొట్టివేయాలంటూ రఘురామ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే తాాజాగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు …ఆ పిటిషన్ ను కొట్టివేసింది. తన కుమారుడు భరత్తో కలిసి రఘురామ సంయుక్తంగా దాఖలు చేసిన ఈ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఇక, ఈ కేసు నేపథ్యంలో ఆ ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ను రఘురామ ఇంట్లో నిర్భందించి దాడిచేశారని ఏపీ పోలీసులు ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ కేసులో నిందితులుగా ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది సైతం సస్పెండ్ అయ్యారని కోర్టులో వెల్లడించారు. పోలీసుల వాదనతో ఏకభవించిన హైకోర్టు రఘురామ పిటిషన్ కొట్టివేసింది.
Comments 1