వైఎస్ వివేకా హత్య కేసుపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొద్ది రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివేకాను చంపింది ఎవరో సీబీఐ విచారణలో తేటతెల్లమయ్యిందని, అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని రఘురామ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, వివేకాను హత్య చేయించింది ఎవరు అనే విషయం మాత్రమే బయటికి రావాల్సి ఉందని, వివేక మృతదేహానికి కుట్లు వేసిందెవరు, ఆ రక్తాన్ని శుభ్రపరిచింది ఎవరు అనేది తేలాలని చెప్పారు.
ఇక, ఎంపీ అవినాష్ రెడ్డిని రెండోసారి విచారణకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారని, దీంతో వివేకా కేసులో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఈ కేసులో మరో రెండు అరెస్టులు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలోనే వివేకా కేసుపై రఘురామ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. త్వరలోనే వివేకా మర్డర్ కేసులో ఒక క్లారిటీ రాబోతుందని జోస్యం చెప్పారు. అంతేకాదు, గంగిరెడ్డి పిటిషన్ కూడా త్వరలో రాబోతుందని రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో వైఎస్ షర్మిల ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేకా కేసుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు. వైఎస్ఆర్ కుటుంబానికి వివేకా మరణం బాధాకరమైన విషయం అని, వివేకా హత్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై గూగుల్ టేక్ ఔట్ విధానం ద్వారా చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.
గతంలోనే సునీల్ కుమార్ పై చర్యల కోసం తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక, ఇదే అంశంపై ఏపీ డీజీపీకి చీఫ్ సెక్రటరీ కూడా లేఖ రాశారని అన్నారు. ఏపీలో వేల కోట్ల రూపాయల లిక్కర్ వ్యాపారం జరుగుతోందని, మూడు వేల వైన్ షాపులకు గాను 11 షాపులకు డిజిటల్ చెల్లింపులు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఏపీ లిక్కర్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలని రఘురామ కోరారు.