విజయవాడలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన కామెంట్లపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఏపీతో, చంద్రబాబుతో, ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తలైవా గుర్తు చేసుకున్న వైనం వైసీపీ నేతలకు మింగుడుపడలేదు. రాజకీయాల గురించి మాట్లాడొద్దని తన అనుభవం చెబుతోందని, కానీ చంద్రబాబు ఉన్న సభలో కాస్తా రాజకీయాలు మాట్లాడకపోతే ఎలా అంటూ చంద్రబాబు పాలనా దక్షతను రజనీ పొగడడంతో వైసీపీ నేతలు ఆయనపై మాటలదాడికి దిగారు.
అయితే, ఆ వ్యవహారంపై రజనీ ఇప్పటిదాకా స్పందించలేదు. కానీ, ఇటీవల జైలర్ విడుదలకు ముందు నిర్వహించిన ఆడియో రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా అర్ధమైందా రాజా అంటూ రజనీకాంత్ చేసిన కామెంట్లు వైసీపీ నేతలనుద్దేశించి పరోక్షంగా చేసినవేనని టాక్ వచ్చింది. దారిన పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, వాటిని పట్టించుకోకుండా నా దారి రహదారి అన్నరీతిలో వెళ్లాలని తలైవా చేసిన కామెంట్ల వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా రజనీ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
జైలర్ సినిమా అద్భుతంగా ఉందని, రజనీకాంత్ ను విమర్శించిన వారికి ఇప్పుడు ఆయనేంటో ‘అర్థమైంది రాజా’ అంటూ రఘురామ చురకలంటించారు. కుటుంబ సమేతంగా జైలర్ సినిమా చూశానని, గత రెండేళ్లలో తాను చూసిన అత్యుత్తమ సినిమాల్లో ఇదొకటని ప్రశంసించారు. ఈ సినిమాను అందరూ తప్పక చూడాలని, సూపర్ స్టార్ రజనీకాంత్ చరిష్మా, స్వాగ్ అద్భుతం అని కితాబిచ్చారు. తలైవా అత్యుత్తమంగా నటించారని, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ టేకింగ్, సంగీత దర్శకుడు అనిరుధ్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ సినిమా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతుందని, చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని రఘురామ ట్వీట్ చేశారు.