వైసీపీ అధినేత జగన్ కు, వైసీపీ నేతలకు ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన రఘురామ….ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోనని కంకణం కట్టుకున్నారు. తనకు ప్రధాని మోడీ అండ ఉందని, తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ముందు ఇది గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నేతలకు రఘురామ వార్నింగ్ కూడా ఇచ్చారు.
వైసీపీ నేతలపై పదునైన విమర్శలతో విరుచుకుపడే రఘురామ….తాజాగా గేరు మార్చారు. ముఖ్యమంత్రి, మంత్రులను ‘ఏంట్రా’ అంటూ దూషణలకు దిగడం సంచలనం రేపింది. అప్పుల్లో కూరుకుపోయిన ఏపీలో చీప్ డ్రామాలు జరుగుతున్నాయని, గ్రామ, వార్డు వాలంటీర్లకు సన్మానాలు పేరుతో రూ.261 కోట్లు తగలేశారని రఘురామ దుయ్యబట్టారు.
ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఇలాంటి పనికిమాలిన పనులకోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణం అని మండిపడ్డారు. పెన్షన్ డబ్బులు అకౌంట్లలో వేసి, రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులిస్తే సరిపోయే దానికి ఓ వ్యవస్థను పెట్టడం, దాన్ని చూసి దేశమంతా గర్విస్తోందని డబ్బాలు కొట్టడం వైసీపీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. వలంటీర్ వ్యస్థను వివస్త్రను చేసి వైసీపీ నేతలు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని చురకలంటించారు.
వాలంటీర్లను జగనన్న సైన్యాలని అభివర్ణించిన మంత్రి పేర్ని నానిపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”అదేంట్రా? ప్రభుత్వ సొమ్ముతో పనిచేసే వాలంటీర్లు జగనన్న సైన్యం ఎలా అవుతార్రా? జగన్ రాజ్యకాంక్షను తీర్చేవాళ్లలాగానే వాలంటీర్లు పనిచేస్తున్నారు కదా? జగన్ సైన్యానికి జనం డబ్బులు ఎందుకు…జగన్ పార్టీ డబ్బులు ఇచ్చి పెట్టించుకోవచ్చుకదా? ప్రజాధనంతో పార్టీ సైన్యాలను నడుపుతున్నాని ఇప్పటికైనా బాహాటంగా ఒప్పుకున్నారుగా..”అని రఘురామ నానిపై, వైసీపీ నేతలపై దుర్భాషలాడారు.
వాలంటీర్ల సన్మాన సభలో సీఎం జగన్, ఇద్దరు మంత్రులు మాస్కులు పెట్టుకోలేదని, వాళ్లు రూ.3వేలు ఫైన్ కట్టాలని చురకలంటించారు. కరోనా సాకుతో జగన్ తిరుపతి ప్రచారాన్ని రద్దు చేసుకున్నారని, కానీ, భారీగా జనం వచ్చిన ఈ సభకు హాజరవ్వడం ఏమిటని నిలదీశారు. మాస్కులు లేకుంటే జనాన్ని కొట్టి చంపుతున్నారని, సభలో సగం మందికి మాస్కులు లేవని, ఇంత నిస్సిగ్గుగ్గా వ్యవహరిస్తారా? ఇదెక్కడి న్యాయం అంటూ నిప్పులు చెరిగారు.
జగన్ ఈ తరహా పనికిమాలిన పనులతో బిజీగా ఉంటే, తెలంగాణలో కొత్త ప్రాజెక్టులను కట్టుకోవడంలో కేసీఆర్ బిజీగా ఉన్నారని రఘురామ అన్నారు. అదే జరిగితే రాయలసీమ ఎడారిగా మారడం ఖాయం అని, సీమ ప్రజలకు నీళ్లిస్తానన్న వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీకి పోతే రఘురామ మీద ఫిర్యాదులు, సొంత పనులతో జగన్ బిజీగా ఉంటారని, కృష్ణా జలాలపై మాట్లాడేందుకు కొంచెం టైం కేటాయిస్తే బాగుంటుందని చురకలంటించారు. నిష్ణాతులను పెట్టుకొని తెలంగాణ కొత్త ప్రాజెక్టులను అడ్డుకోవాలని హితవు పలికారు.
ఏపీలో అన్న జగన్ చేతులు ముడుచుకున్నారని, పుట్టింటోళ్లు తరిమేస్తే…. షర్మిల మాత్రం..అత్తగారింటి కోసం పనిచేయాలని ఫిక్స్ అయ్యారని అన్నారు. నీటి వాటాల్లో తెలంగాణకు అన్యాయం జరగనీయనని, సీమకు చుక్క నీరు కూడా రానీయబోనని షర్మిల అంటున్నారని చురకలంటించారు. ఏపీ రాజన్న రాజ్యంలో సీమకు నీరివ్వడం ప్రధాన అంశం అని,, తెలంగాణ రాజన్న రాజ్యంలో అదే సీమకు నీళ్లను అడ్డుకోవడం ప్రధాన అంశమని ఎద్దేవా చేశారు.
షర్మిల పార్టీతో సంబంధం లేదని జగన్ సలహాదారులు ప్రకటిస్తుంటే, వైసీపీ గౌరవ అధ్యక్షురాలైన వైఎస్ విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి ఆశీర్వచనాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. షర్మిల పార్టీకీ విజయమ్మే వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉంటారా? ఒక వ్యక్తి రెండు పార్టీలకు ఆ పదవుల్లో ఉండొచ్చా?, అసలీ రాజన్న రాజ్యాల డ్రామాలేంటో అర్థం కావట్లేదు… అని రఘురామ అనేక సూటి ప్రశ్నలు సంధించారు. మరి, ఈ ప్రశ్నలకు జగన్, విజయమ్మ, షర్మిల వైసీపీ నేతలు ఏం సమాధానిమిస్తారో వేచి చూడాలి.