ఏపీ సీఎం జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కంట్లో నలుసులా, పక్కలో బల్లెంలా మారిన సంగతి తెలిసిందే. స్వపక్షంలో విపక్షంలా మారిన రఘురామపై చర్యలు తీసుకోలేక…పార్టీ నుంచి తీసేయలేక…అనర్హత వేటు వేయించలేక జగన్ సతమతమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, తనపై అనర్హత వేటు వేయించాలని రఘురామ ఛాలెంజ్ చేసినా…జగన్ అండ్ కో దానిని స్వీకరించలేదు.
దీంతో, వారి బాధ చూడలేక తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, కానీ, తనపై అనర్హత వేటు వేయించలేనని జగన్ ఒప్పుకుంటేనే అలా చేస్తానని రఘురామ షరతు పెట్టారు. అయినా సరే, ఆ షరతుకు జగన్ ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే రఘురామపై సందు దొరికిందంటే చాలు కక్ష సాధించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉంటున్నారు. కల్తీ మద్యం శాంపిల్స్ తీయించిన రఘురామపై క్రిమినల్ కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో, ఈ వ్యవహారాన్ని పార్లమెంటులో ప్రస్తావించిన ఆర్ఆర్ఆర్….ఏపీ ఆర్థిక దుస్థితిపై ప్రధాని స్పందించాలని, ఆర్టికల్ 360 ప్రయోగించాలని కూడా లేఖ రాశారు.
ఏపీ అప్పుల ఊబిలో మునిగిపోయిందని పలుమార్లు చెప్పిన రఘురామ…తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనపై సెటైర్లు వేశారు. అప్పుల కోసమే ఢిల్లీలో బుగ్గన పర్యటిస్తున్నారని ఆర్ఆర్ఆర్ చురకలంటించారు. అప్పు కావాలి మహాప్రభో అని ఢిల్లీ వీధుల్లో అడుక్కుంటున్నారని పంచ్ లు వేశారు. సీఎం జగన్కు ఈ రుణ దాహం ఎప్పటికి తీరుతుందోనంటూ ఎద్దేవా చేశారు. జగన్ సర్కారుకు అప్పులపైనే ఆలోచన ఉందని, విజన్ అంటూ ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. ఏపీలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని, తమ ప్రభుత్వానికి ముందు చూపు కన్నా మందు చూపే ఎక్కువని చురకలంటించారు.