వైసీపీ నేత, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో దాదాపు రూ.390 కోట్ల స్కామ్ చేశారని టీడీపీ నేత పట్టాభి రాం గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. తణుకు మున్సిపాలిటీతో స్థలాలు కొనిపించి.. వాటిని మళ్లీ టీడీఆర్ బాండ్ల రూపంలో కేటాయింపజేసుకుని వందల కోట్లు కొల్లగొట్టారని పట్టాభి ఆరోపించడం సంచలనం రేపింది. అయితే, తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కారుమూరి వివరణనిచ్చే ప్రయత్నం చేసినా…ఫలితం లేదు.
ఎందుకంటే ఆ ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం…ప్రభుత్వం రాత్రికి రాత్రే తణుకు మున్సిపల్ కమిషనర్ ఎన్.వాసుబాబు, టీపీవో ఎ.రామకృష్ణ, టీపీఎస్ ఏఎస్ ప్రసాద్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో కారుమూరి స్కామ్ నిజమేనని తేలినట్లయింది. దీంతో, కుంభకోణం సూత్రధారి కారుమూరిని కాపాడేందుకు ఆ అధికారులను బలిపశువులను చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి, ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. తణుకు టీడీఆర్ బాండ్ల అక్రమాల్లో అంతిమ లబ్దిదారులు ఎవరో తేల్చాలని, ఆ గుట్టును మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించాలని డిమాండ్ చేశారు. అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, ఆ టీడీఆర్ లకు రూ.390 కోట్లకు పైగా ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ స్కాంలో స్థానిక ప్రజాప్రతినిధులేనా? లేక, పైస్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారా? అన్నది తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాదు, తణుకు మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలోనూ ఈ తరహా స్కామ్ లు జరిగాయా అన్న కోణంలో కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై పురపాలక శాఖ మంత్రి బొత్స, నగరపాలక సహాయక కమిషనర్ శ్రీలక్ష్మి విచారణ జరపి ఓ నివేదిక రూపొందించాలని సూచించారు. అంతేకాదు, ఆ నివేదికను వైసీపీ నేతలు, సీఎం జగన్ లు చూసి సరిపెట్టుకోకుండా, ఆ నివేదికను ప్రజలకు కూడా బహిర్గతం చేయాలని రఘురామ డిమాండ్ చేశారు.
ఇక, టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై ప్రభుత్వం విచారణ జరుపుతుందని, దీంట్లో టీడీపీ సానుభూతిపరులే లబ్దిదారులని బొత్స ఆరోపించడం కొసమెరుపు. వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారని బొత్స చెప్పడం విశేషం.