వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేయబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలనను ఎండగడుతూ, జగన్ పై విమర్శలు గుప్పిస్తున్న రఘురామపై అనర్హత వేటు వేసేందుకు ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పుకార్లను నిజం చేస్తూ రఘురామ సంచలన ప్రకటన చేశారు. తనపై ఎంత సమయంలోపు అనర్హత వేటు వేయిస్తారో చెప్పాలని, ఆ డెడ్ లైన్ వరకూ చూసి తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఆ తర్వాత నర్సాపురం నుంచి అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగాలన్న ఎజెండాతో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షను తన ఉపఎన్నిక ద్వారా వ్యక్తం చేసేలా చూస్తానని అన్నారు. అయితే, రఘురామ బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్న ఆర్ఆర్ఆర్….ఏపీ బీజేపీలో చక్రం తిప్పబోతున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏపీలో రఘురామ రాజకీయం మొదలుబెడతారని తెలుస్తోంది.
అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా రఘురామను పార్టీలో చేర్చుకునే అవకాశముందని కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు తాజాగా రఘురామ రాజీనామా అంశం తెరపైకి రావడంతో ఆ వార్త నిజమనిపిస్తోంది. అయితే, ఫలానా పార్టీ నుంచి పోటీ చేస్తానని రఘురామ చెప్పలేదు. ఈ విషయంపై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.