వైసిపి అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు గత రెండు సంవత్సరాలుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. సమయం, సందర్భం చూసుకొని తమ పార్టీ నేతల గుట్టు రట్టు చేయడంలో, వారి లోపాలను జనాలను దృష్టికి తీసుకురావడంలో రఘురామ ఎప్పుడూ ముందుంటున్నారు. వైసిపి నేతలకు, రఘురామకు మధ్య మాటల యుద్ధం గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.
ఈ క్రమంలోనే తాజాగా వైసిపి నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రఘురామ షాకింగ్ ఆరోపణలు చేశారు. స్థాయీ సంఘం చైర్మన్ పదవి నుంచి విజయసాయిని తప్పించాలని రఘురామ లేఖ రాశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ కు రఘురామ రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విజయసాయి నీచమైన భాష వాడుతున్నారని రఘురామ ఆ లేఖలో ఆరోపించారు.
తన దిగజారిన భాషతో పెద్దల సభ ఔన్నత్యాన్ని విజయసాయి దెబ్బతిస్తున్నారని ఆ లేఖలో రఘురామ పేర్కొన్నారు. ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై విజయసాయి అసభ్యకరమైన భాషతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. విజయ సాయి రెడ్డి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన అంశాలు, అసహ్యకరమైన పోస్టులు, భాషా కనిపిస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
పార్లమెంటు గౌరవాన్ని కాపాడడంలో రాజ్యసభ చైర్మన్ పాత్ర కీలకమని, అందుకే ఇలాంటి అనుచిత భాష వాడుతున్న విజయసాయిరెడ్డిని స్థాయీ సంఘం చైర్మన్ పదవితోపాటు ఎథిక్స్ కమిటీ నుంచి కూడా తప్పించాలని రఘురామ కోరారు. మరి ఈ లేఖపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ కర్ స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.