వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీలో నెంబర్ 2గా ఉంటున్న ఎంపీ విజయసాయిరెడ్డిపై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సందు దొరికినపుడల్లా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం, తమ ముఖ్యమంత్రి అంటూనే జగన్ పై రఘురామ సెటైర్లు వేస్తున్న వైనం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి జగన్, విజయసాయి, సజ్జలపై ఆర్ఆర్ఆర్ తన మార్క్ కామెంట్లతో చురకలంటించారు.
అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని రఘురామ అన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే కాన్సెప్టే లేదని, కానీ, అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు జగన్, కొందరు మంత్రులు చెబుతున్న కుంటి సాకులు సరైనవి కావని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందని ఆయన అన్నారు. అమరావతే ఏపీకి రాజధాని అని, అంతిమ విజయం రైతులదే రఘురామ ధీమా వ్యక్తం చేశారు. ఎవరూ ఫిర్యాదు చేయకున్నా కొందరు అధికారులు కేసులు పెట్టారని, వారిపై చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు.
ఏపీలో అమ్మోఒకటో తారీకు సినిమా కొద్ది నెలలుగా నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్ లు వచ్చేవి. కానీ, కొన్ని నెలలుగా ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే వీలైనంత త్వరగా ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించాలని రఘురామ అన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు అని జగన్ హామీ ఇచ్చారని, తమ ముఖ్యమంత్రి మాట ఇస్తే తప్పడని అన్నారు.
హైకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ కార్యకర్తపై సీబీఐ చార్జిషీట్ నమోదు చేసిందని మిగతా 90మందిపైనా చర్యలు తీసుకున అవకాశం ఉందని రఘురామ అన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నిందిస్తూ జగన్ సాక్షి దినపత్రిలో ఓ ఆర్టికల్ వచ్చిందని, కొందరు న్యాయమూర్తుల పేర్లు పెట్టి మరీ కథనం రాశారని విమర్శించారు. ఆ కథనం న్యాయవ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసేలా ఉందని, సీబీఐ కోర్టు తీర్పులను సాక్షి పత్రిక ముందే చెబుతోందని, దానిపై విచారణ జరిపించాలని పిటిషన్ వేస్తానని ప్రకటించారు.
విశాఖలో అక్రమాల్లేవని విజయసాయిరెడ్డి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు పెడతానన్నారని, కానీ, ఫోన్ చేసి ఫిర్యాదులు చేసేవారికి భద్రత ఏదని ప్రశ్నించారు. గతంలో ఫోన్ చేసినవారిపై దాడుల జరిగాయని అన్నారు. విశాఖలో భూకబ్జాలు చేసేదెవరో తేల్చాలన్నారు. వృద్ధుల పెన్షన్ విషయంలో సజ్జల వ్యాఖ్యలు సరికాదని, వారికి ఏపీలో ఓటు ఉందో లేదో చూసుకునే పెన్షన్ ఇచ్చారని గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థ అవినీతి మయం అయిపోయిందన్నారు.