అధికార పార్టీకి చెందిన నేతల చుట్టాలు, పక్కాలు అర్ధరాత్రి పోలీసులతో గొడవ పడడం…ఈ క్రమంలోనే ఆ నేత బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం….హుటాహుటిన సదరు నేత అర్ధరాత్రి పూట ఆఘమేఘాల మీద పోలీస్ స్టేషన్ లో వాలిపోయి పంచాయతీ చేయడం…కేసు, గీసు లేకుండా తమ అనుచరులను విడిపించి తీసుకెళ్లడం…మన తెలుగు సినిమాల్లో ఇటువంటి సీన్లకు కోకొల్లలు.
రియల్ లైఫ్ లో సీన్లను రీల్ లైఫ్ లో పెడుతుంటారో…లేక రీల్ లైఫ్ లో సీన్లు చూసి రియల్ లైఫ్ లో చేస్తుంటారో తెలీదుగానీ…అచ్చు అలాంటి సీన్ ఒకటి నిన్న అర్ధరాత్రి విజయవాడలో జరిగింది. తమ అనుచరును అరెస్టు చేశారన్న కారణంతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్..స్వయంగా స్టేషన్ కు వచ్చి పోలీసులతో ఆ వ్యవహారం సెటిల్ చేసిన వైనం ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
మంగళవారం అర్ధరాత్రి సమయంలో విజయవాడంలో బస్టాండ్ ఎదురుగా ఉన్న గంగోత్రి హోటల్ వద్ద ఒకే బైక్ పై ట్రిపుల్స్ రైడ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను కృష్ణలంక ఎస్ఐ ఆపారు. ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ పై ప్రశ్నించారు. అయితే, తాము ఎంపీ నందిగం సురేష్ అనుచరులమని ఆ యువకులు నానా రచ్చ చేశారు. అంతేకాదు, పోలీసులతో వాగ్వాదం వీడియోను నందిగం సురేష్ కు పంపారు.
దీంతో, ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న నందిగం సురేష్ తన అనుచరులతో అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చి హల్ చల్ చేశారు. ఎస్ఐతోపాటు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సురేష్ అనుచరులు వీరంగం వేశారు. దీంతో, నందిగం సురేష్, అతడి అనుచరుల తతంగం మొత్తాన్ని కానిస్టేబుల్ శ్రీనివాస్ వీడియో తీశారు.
ఆ కారణంగా కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై దాడి చేసిన సురేష్ అనుచరులు… కానిస్టేబుల్ నుంచి ఫోన్ లాక్కోవడంతో పాటు స్టేషన్ లో ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. స్టేషన్లో గొడవ పడి అనుచరులతో కలిసి వెళుతున్న సమయంలో తన ఫోన్ తిరిగివ్వాలని కానిస్టేబుల్ శ్రీనివాస్ కోరగా…అతడిపై సురేష్ అనుచరులు దాడిచేసి కొట్టినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు సురేష్ మేనల్లుడని తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కుండా పోలీసు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.