వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ పై ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విష యం తెలిసిందే. పల్నాడు జిల్లాకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ యజమాని నుంచి రూ.2 కోట్ల రూపాయల ను ఆమె లంచంగా తీసుకున్నారని ఆ కేసులో పేర్కొన్నారు. దీనిలో అప్పటి అధికారి, ఐపీఎస్ జాషువా ప్రమేయం కూడా ఉందని.. ఆయనకు 20 లక్షల రూపాయలు ముట్టాయని కూడా తెలిపారు. అంతేకాదు.. ఈ వ్యవహారం అంతా.. రజనీ మరుదులు చూశారని పేర్కొన్నారు.
అయితే.. తనపై కేసు నమోదైన విషయంపై రజనీ స్పందిస్తూ.. ఇది ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు తనపై ఉన్న కక్షతోనే చేయిస్తున్నారని, బాలాజీ క్రషర్ సంస్థ యజమాని లావుకు బంధువని.. అందుకే.. తనపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించారని ఆమె ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా.. తనను ఎవరూ ఏమీచేయలేరన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు స్పందించారు. తనకు బాలాజీ సంస్థకు ఎలాంటి బంధుత్వం లేదన్నారు.
పైగా.. తాను 40 ఏళ్ల నుంచి విద్యాసంస్థలను నిర్వహిస్తున్నానని.. ఒక్క రూపాయి కానీ.. ఒక్క సెంటు భూమి కానీ.. ఎవరి నుంచి తీసుకోలేదని స్పష్టం చేశారు. తనకు , బాలాజీ క్రషర్ సంస్థకు మధ్య ఎలాంటి సంబం ధం లేదని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాషువానే తన వాంగ్మూలంలో పేర్కొన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి విడదల రజనీ.. ఆమె బంధువులు జిల్లాలో అనేక మందిని బెదిరించి.. సొమ్ములు వసూలు చేశారని ఆరోపించారు.
కానీ, తనపై ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదని ఎంపీ చెప్పారు. విడదల రజనీ సొమ్ములు తీసుకోక పోయి ఉంటే.. తన వద్దకు తన మనుషులను పంపించి కేసు వెనక్కి తీసుకునేలా ప్రయత్నించాలని ఎందుకు కోరారని ఆయన ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బెదిరించకపోతే.. ఇప్పుడు ఎందుకు భయప డుతున్నారని ఆయన నిలదీశారు. కేసు పురోగతిలో ఉందని.. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు వెళ్తారని ఆయన వ్యాఖ్యానించారు.