వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత భూకబ్జాలు, అక్రమ మైనింగ్ లు పెరిగిపోయాయని,ఆ వ్యవహారాల్లో వైసీపీ నేతలు కోట్లు దండుకున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమ మైనింగ్ ను ప్రశ్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి చేయడం, ఆ తర్వాత దాడికి గురైన ఆయననే అరెస్టు చేయడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌పై రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే చేసిన సంచలన ఆరోపణలు అధికార పార్టీని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే.
రాజమండ్రిలో కొండను తవ్వి కోట్లు కొల్లగొట్లిన వైసీపీ నేతలు…. చేపల చెరువులను తలపించే చోట ఇళ్ల స్థలాలు కేటాయించిన వైనాన్ని గోరంట్ల రట్టు చేశారు. చెరువును తలపించేలా ఉన్న మైనింగ్ జరిగిన ప్రాంతంలో గోరంట్ల చేసిన పడవ ప్రయాణం అధికారపార్టీలో దుమారం రేపుతోంది. 850 మంది పేదలకు ఇక్కడే ఇళ్లు కట్టిస్తామని అధికార పార్టీ చెప్పిందంటూ గోరంట్ల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అయితే, గోరంట్లకు కౌంటర్ గా వైసీపీ ఎంపీ భరత్ కిమ్మనకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
కడియం మండలం వేమగిరిలోని 20 ఎకరాల్లో ఉన్న కొండను చెరువులుగా తవ్వేసి ఎంపీ అనుచరులు రూ.60 కోట్ల విలువైన గ్రావెల్‌ను అమ్ముకున్నారని గోరంట్ల విమర్శలు గుప్పించారు. అంతేకాదు, చెరువుగా మారిన కొండ స్థలంలో గోరంట్ల, టీడీపీ నేతలు పడవపై ప్రయాణించి ఏపీ ప్రజలకు వైసీపీ నేతల అవినీతి అర్థమయ్యేలా నిరసన తెలిపారు. చెరువుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఏలా కేటాయిస్తారని గోరంట్ల నిలదీశారు.
దీంతో, అడ్డంగా బుక్కయిన భరత్…గోరంట్లకు కౌంటర్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే గోరంట్లపై దళితులతో తప్పుడు కేసులు బనాయించే స్కెచ్ వేశారని టాక్ వస్తోంది. వేమగిరిలోని ఆవ భూముల్లోనూ భరత్ ఇళ్ల స్థలాల పేరుతో రూ.100కోట్లు దోచుకున్నారని గోరంట్ల ఆరోపిస్తున్నారు. ఇక, సారా వ్యాపారంలోనూ ఎంపీ వాటా ఎంతో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై గోరంట్ల సీబీఐ విచారణ కోరడంతో భరత్, రాజమండ్రి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట.
కానీ, గోరంట్ల ఆరోపణలపై ఎంపీ భరత్ నేరుగా ఎందుకు స్పందించటం లేదన్నది ఆసక్తిగా మారింది. తప్పు చేసిన భరత్ వివరణనిచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా గోరంట్ల ఇరికించేశారని అంటున్నారు. అందుకే, భరత్..దళితులతో గోరంట్లపై కేసులు పెట్టించడం…చోటా మోటా నేతలతో…ఈ మైనింగ్ టీడీపీ హయాంలో జరిగిందని చెప్పించడం చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా గోరంట్ల పడవ ప్రయాణంతో జగన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.