ఏపీలో సినిమా టికెట్ల రేట్లు, ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోలపై ఇటీవలే జగన్ సర్కార్ ఓ నిర్ణయం తీసుకోవడంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ, సినిమా టికెట్లకు సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానం వ్యవహారం మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ వ్యవహారంపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఇతర ప్రైవేట్ సంస్థల కంటే తక్కువ ధరకే ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రభుత్వమే నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసిన జగన్ సర్కార్… ఆన్ లైన్ టికెటింగ్ కోసం టెండర్ల ప్రక్రియను కూడా ముగించినట్లు తెలుస్తోంది. టెండర్లలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు వెంకటేష్ కు చెందిన జస్ట్ టిక్కెట్ సంస్థ L-1గా నిలిచినట్లు ప్రచారం జరిగింది. అయితే, టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరగలేదని, బుక్ మైషో కూడా తక్కువ కోట్ చేసినా…టెండర్ దక్కలేదని పుకార్లు రావడంతో ఆ ప్రక్రియ అటకెక్కింది.
అయితే, అనూహ్యంగా ఈ నెల 2న ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా టికెట్లను అమ్మాలని నిర్ణయించిన జగన్ సర్కార్ జీవో 69ని జారీ చేసింది. టికెట్ల అమ్మకాలకు సంబంధించి నెల రోజుల్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ఆ తేనెతుట్టెను ఏపీ సర్కార్ కదిలించినట్లయింది. ప్రభుత్వం ఇచ్చిన ఎంఓయూ పత్రాలను చూసిన థియేటర్ యజమానులు షాక్ అయ్యారు. అంతేకాదు, ఎంవోయూపై జులై 2లోగా సంతకాలు పెట్టాలంటూ డెడ్ లైన్ జారీ చేయడంతో అవాక్కయ్యారు.
ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం వరకు బాగానే ఉందని, కానీ, టికెట్లు అమ్మిన తర్వాత థియేటర్ల యజమానులకు డబ్బు ఎప్పుడు జమ చేస్తారనే విషయంపై ఎంఓయూలో స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే, గతంలో మాదిరిగానే ఫిలిం ఛాంబర్ ద్వారానే ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతామని ఎగ్జిబిటర్లు కోరారు. ఎంవోయూపై సంతకం పెడితే ఒప్పుకున్నట్లేనని, అది తమకు ఇష్టం లేదని అంటున్నారు. అవసరమైతే థియేటర్లు మూసివేసేందుకు కూడా రెడీ అని యజమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే థియేటరో ఓన్లు, ఎగ్జిబిటర్ల అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ సీఎం జగన్ కు ఫిలిం ఛాంబర్ లేఖ రాసింది. ఆ లేఖపై జగన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.