టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య తరచుగా తన పేరే ఒక బ్రాండ్ అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇప్పుడు తనకు తాను ఆ మాట చెప్పుకుంటున్నాడు కానీ.. ఒకప్పుడు ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా ఆయన్ని ఒక బ్రాండ్ లాగే చూసేవారు. దిల్ రాజు నుంచి ఓ సినిమా వస్తోందంటే ఆషామాషీగా ఉండదు అనే నమ్మకం ఉండేది. ఆయనేదైనా సినిమాను తన చేతుల్లోకి తీసుకుని రిలీజ్ చేసినా కళ్లు మూసుకుని జనం థియేటర్లకు వెళ్లిపోయారు.
ఒక కథ విన్నా.. సినిమా రష్ చూసినా ఒక సగటు ప్రేక్షకుడిలా దిల్ రాజు ఆలోచించి దాని ఫలితాన్ని అంచనా వేస్తాడని ఇండస్ట్రీలో చెప్పుకునేవాళ్లు. ఆయన నిర్మించిన, డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమాల ఫలితాలు అందుకు తగ్గట్లే ఉండేవి. కానీ ఈ మధ్య ఆయన జడ్జిమెంట్ బాగా దెబ్బ తినేస్తోంది. రాజులోని సగటు ప్రేక్షకుడు ఏమవుతున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ మూవీ మరో బేనర్ నుంచి వస్తే ఏమో కానీ.. దిల్ రాజు బేనర్ నుంచి ఇలాంటి సినిమాను ఎవ్వరూ ఊహించి ఉండరు. సినిమా చూస్తున్న వాళ్లందరికీ ఒకటే సందేహం.. కథ వింటున్నపుడు కానీ, సినిమా చూస్తున్నపుడు కానీ ఇది వర్కవుట్ కాదని రాజుకు ఎందుకు అనిపించలేదు అని. కొన్ని సీన్లు చూసి వీటిని రాజు ఎలా ఫైనల్ కాపీలో వదిలేశాడు అని ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు ‘లవ్ మి’ సినిమా చూసినా కూడా ఇదే ఆశ్చర్యం.
ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే రాజు ఈ కథ విని ఎలా కన్విన్స్ అయ్యాడు.. అసలు ఆయనకైనా కథ అర్థమైందా అని సందేహం కలుగుతుంది. ఈ కథ విన్న ఎవరికైనా ఎన్నో లాజికల్ ప్రశ్నలు తలెత్తుతాయి. కానీ ఆ ప్రశ్నలకు సమాధానాలు లేని విధంగా సినిమా తీసేశారు. పోనీ రష్ చూసుకున్నపుడైనా రాజుకు చాలా డౌట్లు కొట్టి ఉండాలి. ఎలాగూ సినిమాను నెల రోజులు వాయిదా వేశారు. ఆ టైంలో అయినా.. మార్పులు చేర్పులు చేసి కొంచెం మెరుగ్గా తయారు చేసి వదలాల్సింది. కానీ అదీ జరగలేదు. ఇదంతా చూస్తే రాజులోని సగటు ప్రేక్షకుడు నెమ్మదిగా అంతర్ధానం అయిపోతున్నాడనే అనుమానాలు కలుగుతున్నాయి.