షెడ్యూల్ ఎన్నికలు ముంచుకువస్తున్న నేపధ్యంలో తెలంగాణ బీజేపీ నేతల్లో చాలామందికి దిక్కుతోచటంలేదు. ఒకపుడు పార్టీలో ఉన్న జోష్ ఇపుడు ఎక్కడా కనబడటంలేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి రాబోయేది బీజేపీనే అన్నంత ఊపు పార్టీలో కనబడేది. అయితే ఇపుడు అలాంటి ఊపు టార్చిలైటు వేసి వెతికినా ఎక్కడా కనబడటంలేదు. కారణం ఏమిటంటే పార్టీ అగ్రనేతల స్వయంకృతమనే చెప్పాలి. విచిత్రం ఏమిటంటే కేసీయార్ వ్యతిరక పోరాటం అన్న ట్యాగులైన్ తోనే పార్టీలో జోష్ పెరిగింది.
అలాంటి ట్యాగ్ లైనును పార్టీ పక్కనపడేయటంతో నేతల్లో ఉత్సాహమంతా నీరుగారిపోయింది. కేసీయార్ వ్యతిరేకత అంతా అచ్చంగా మీడియా సమావేశాల్లో తప్ప ఇంకెక్కడా కనబడటంలేదు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర తెలంగాణా బీజేపీని చాలా బలంగా దెబ్బతీసింది. అప్పట్లోనే కవితను ఈడీ అరెస్టుచేసుంటే పార్టీ కత వేరుగా ఉండేది. అలాకాకుండా చాలామందిని అరెస్టుచేసిన ఈడీ కల్వకుంట్ల కవితను మాత్రం ఫ్రీగా వదిలేయటంతో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని జనాలకు అర్ధమైపోయింది.
ఇదే సమయంలో కేసీయార్ కూడా నరేంద్రమోడీగురించి అసలు మాట్లాడటమే మానుకున్నారు. దాంతో జనాల అనుమానాలు నిర్ధారణ అయిపోయాయి. అసలు పార్టీకి ఆయువుపట్టే కేసీయార్ వ్యతిరేక పోరాటం. ఇపుడు పార్టీలో అలాంటి పోరాటం ఎక్కడా కనబడటంలేదు. అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఒక్కటంటే ఒక్క ప్రోగ్రామ్ కూడా కేసీయార్ కు వ్యతిరేకంగా చేయలేదు. ఒకపుడు అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నపుడు వారంలో మూడు, నాలుగు రోజులు కేసీయార్ ప్రభుత్వంపై ఏదో ఒక పంచాయితీ తెచ్చేవారు. ఇపుడు అలాంటి వాటికి తావేకనబడటంలేదు.
దాంతో చాలామంది కమలనాదులకు ఏమిచేయాలో దిక్కుతోచటంలేదు. పార్టీలో ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదని సీనియర్లలో చాలామందికి అనుమానాలు మొదలయ్యాయట. నరేంద్రమోడీ తెలంగాణా పర్యటన తర్వాత పార్టీలో ఉండాలా లేకపోతే వదిలేయాలా అనే విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. కాకపోతే కాంగ్రెస్ లో చేరినా రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కే విషయంలో క్లారిటి లేకపోవటం వల్లే పార్టీమార్పు విషయం వాయిదా పడుతోందని సమాచారం. మరి మోడీ పర్యటన తర్వాత ఎలాంటి మార్పులుంటాయో చూడాల్సిందే.