రాజకీయ నాయకులకు ప్రచార పిచ్చి ఉంటుంది. ఇది సహజమే. వారు ఏం చేసినా.. ప్రచారం కోరుకుంటారు. ఇక, ఎన్నికల వేళ మరింతగా ప్రచారం దుమ్మురేపుతారు. కొంత సొంత సొమ్ము ఇచ్చి మరీ ప్రచారం చేయించుకునే నాయకులు కూడా ఉన్నారు. ఇక, సహజంగానే ప్రచారం వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ, ఎలాంటి హడావుడీ లేని.. ఎలాంటి ప్రజానీకం లేని.. చోట కూడా ప్రచారం కోరుకునే నాయకులు ఉంటారా? అంటే.. మన దేశ ప్రధాని మోడీ అని అంటున్నారు నెటిజన్లు.
తాజాగా తెలంగాణలో ఎన్నికల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. ఆదివారం సాయంత్రం కొంత గ్యాప్ తీసుకుని తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతికి రాగానే రేణిగుంట విమానాశ్రయంలో సీఎం జగన్, గర్నవర్ అబ్దుల్ నజీర్ ఉన్నతాధికారులు.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ క్రమంలో ఆయన చేసిన చిత్రమైన వ్యవహారం ఇప్పుడు నెటిజన్ల నుంచి ట్రోల్స్ వచ్చేలా చేసింది. విమానాశ్రయంలోనే ఆయన తన కారు డోర్ వద్ద నిలబడి చేతులు ఊపుకుంటూ ముందుకు సాగారు. ఇలా కొద్ది సేపు ముందుకు వెళ్లాక.. ఇక అక్కడ ఎవరూ లేరు. కేవలం రోడ్డు, లైట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో అక్కడ చేతులు ఊపడం విరమించి.. లోపల ఆశీనులయ్యారు.
వాస్తవానికి రేణిగుంట విమానాశ్రయమైనా.. ఇతర విమానాశ్రయాలైనా.. నగరాలకుకనీసం 10 నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటాయి. ఆయా విమానాశ్రయాల వద్ద పెద్దగా సాధారణ జనం రాకపోకలు ఉండవు. నిషేధం కూడా. ఇక, విమానాశ్రయాల్లో కూడా.. లాంజ్లలో మాత్రమే ప్రయాణికులు ఉంటారు తప్ప.. బయట రోడ్లపై ఉండరు. కానీ.. ప్రధాని మోడీ ఏమనుకున్నారో .. ఏమో.. ఆహ్వానం అనంతరం.. వెంటనే కారెక్కి.. ఆ వెంటనే తన సీటు పక్కనున్న డోర్ తీసుకుని.. కింద ఫుట్ రెస్ట్పై నిలబడి గాలిలోకి చేతులు ఊపుతూ ముందుకు సాగారు.
కానీ, అక్కడ జనాలు లేరు. కేవలం ఎయిర్పోర్టులో రోడ్లు, లైట్లు మాత్రమే ఉన్నాయి. ఇక, కేవలం .. పోలీసులు.. ప్రధాన మంత్రి పర్యటనను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ.. మోడీ ఇలా గాలిలోకి చేతులు ఊపుతూ.. ముందుకు సాగడంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. “చేతులుఊపడం అలవాటైపోయిందా సర్!“ అని కొందరు కామెంట్స్ చేశారు.