భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందం ఒకటి కుదిరింది. మనదేశంలో ఫైటర్ జెట్ ఇంజన్ల తయారీకి ఉపయోగించే టెక్నాలజీని బదిలీ చేసుకునేందుకు అమెరికాలోని ప్రతిష్టాత్మక కంపెనీ జీఈ అంగీకరించింది. ఈ ప్రకారం జీఈ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇప్పటివరకు అమెరికా, బ్రిటన్ ల దగ్గర మాత్రమే ఉన్న అత్యాధునిక సాంకేతికత ఇకపై భారత్ కు అందనుంది.
ఫైటర్ జెట్ ఇంజన్ల తయారీ సాంకేతికతను భారత్ కు అందించాలని అమెరికా నిర్ణయించింది. యుద్ధ విమానాలను తయారు చేసే శక్తివంతమైన F-414 జెడ్ ఫైటర్ ఇంజన్లను ఇకపై భారత్ లో ఉత్పత్తి చేయబోతున్నారు. భారత్ హెచ్ఏఎల్ లతో దీర్ఘకాలిక భాగస్వామ్యం కారణంగా ఈ ఒప్పందం సాధ్యమైందని జీఈ ఏరోస్పేస్ టెక్నాలజీస్ సీఈవో హెచ్ లారెన్స్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోడీల పరస్పర సహకారం, ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరిందని చెప్పారు.
జీఈ తయారు చేసే F-414 ఇంజన్లకు సాటి మరే ఇంజన్లు లేవని ఆయన అన్నారు. వీటి ఉత్పాదన వల్ల ఇరు దేశాలకు ఆర్థిక, జాతీయ భద్రత ప్రయోజనాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హెచ్ లారెన్స్ ను కలిసిన ప్రధాని మోదీ…ఆయనకు అభినందనలు తెలిపారు. భారత్ లో జెట్ ఫైటర్ ఇంజన్ల తయారీ ప్రణాళికపై హర్షం వ్యక్తం చేశారు.