ఏపీ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతాలిచ్చేందుకు కూడా తిప్పలు పడుతోందని తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.సీఎం జగన్ చేస్తున్న అప్పులు..వాటికోసం ఏపీ ప్రభుత్వం పడుతున్న తిప్పలు జాతీయ స్థాయిలో సైతం చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో అప్పుల వ్యవహారంపై చాలాకాలం కిందటే కేంద్రం ఫోకస్ పెట్టింది.
ఏపీలో కార్పొరేషన్ల ముసుగులో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల అక్రమాల నిగ్గుతేల్చాలని, ఏపీ అప్పులపై ప్రాథమిక స్థాయిలో వివరాలు సమర్పించాలని అకౌంటెంట్ జనరల్(ఏజీ)కు కేంద్రం గతంలో సంచలన ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులను ఏజీ కార్యాలయ అధికారులు గతంలో సంప్రదించారు. పరిమితికి మించి చేసిన అప్పుల లెక్కలను అడిగారు. అంతేకాదు, కేంద్రానికి, ఆర్బీఐకి, ఏజీకి తెలియకుండా రూ.లక్ష కోట్ల అప్పులు తెచ్చిన వైనంపైనా వారు ఆరా తీశారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయినా సరే, జగన్ తీరు మారలేదు.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీని ఉద్దేశించి పరోక్షంగా ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందినకాడికి అప్పులు తెచ్చి ఎడాపెడా ఖర్చు చేస్తే భవిష్యత్ తరాలపై మోయలేని రుణభారం పడుతుందని ఏపీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలను పరోక్షంగా హెచ్చరించారు. రాజ్యసభలో ప్రసంగించిన మోడీ రాష్ట్రాల వ్యయ నియంత్రణపై ప్రసంగించారు. అప్పు చేసి ఎడాపెడా ఖర్చు చేస్తే పొరుగు దేశాలు పాకిస్థాన్, శ్రీలంకలు ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యాన్ని మన దేశం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
పదవీకాంక్షతో కొందరు నేతలు భావితరాలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారని పరోక్షంగా జగన్ వంటి సీఎంలను ఉద్దేశించి మోడీ షాకింగ్ కామెంట్లు చేశారు. పంజాబ్ సహా కొన్ని బిజెపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయడాన్ని మోడీ ప్రస్తావించారు.