వేడుకోవటాలు.. సర్ ప్రైజ్ లు ఇచ్చే బదులు.. అదొక్కటి చేయచ్చుగా మోడీ?

దేశంలో ఇప్పటివరకు చాలామంది ప్రధానమంత్రులు అయ్యారు. కానీ.. మిగిలిన వారికి నరేంద్ర మోడీకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయనలాంటి నేత.. ప్రధాని కుర్చీలో ఇప్పటివరకు కూర్చోలేదని చెప్పాలి. ఇందిర తర్వాత బలమైన ప్రధానిగా ఆయన్ను చెప్పాలి. ఇందిర తప్పుల మీద తప్పులు చేయటం.. కొన్ని నిర్ణయాలతో విమర్శల్ని పెద్ద ఎత్తున ఎదుర్కొన్నారు. మోడీ కూడా అలాంటి పెద్ద తప్పులు చేస్తున్నారు. కానీ మతవాద అభిమానులతో కూడిన భారీ ఫాలోయింగ్.. దేశ వ్యాప్తంగా అభిమాన గణం.. ఆయన్ను ఆరాధించే వారు బోలెడంత మంది ఉండటంతో నెట్టుకువస్తున్నారు.

కరకు నిర్ణయాలు తీసుకోవటంలో మోడీకి మించినోళ్లు లేరనే చెప్పాలి. సమస్యలకు ఎదురెళ్లటమే తప్పించి.. వాటిని తప్పించుకోని తిరగటం ఆయనకు ఇష్టం ఉండదు. అన్నింటికి మించిన ఎప్పటికప్పుడు సమయానికి తగ్గట్లు నాటకీయతను పండించటం.. అందులో అందరిని భాగస్వామ్యం చేయటం ఆయనకు మాత్రమే సాధ్యమయ్యే టాలెంట్. ప్రధానిగా తన ఏడేళ్ల పదవీ కాలంలో రైతులు తాజాగా చేస్తున్న దీక్ష మినహాయిస్తే.. ఆయన ఇప్పటివరకు పెద్దగా సమస్యల్ని ఎదుర్కొన్నదే లేదనే చెప్పాలి.

రైతుల సమస్యల మీద మొదటి రెండు వారాలు చూసిచూడనట్లుగా వ్యవహరించిన ఆయన.. మూడో వారంలోకి వచ్చేసరికి ఆయనే నేరుగా సీన్లోకి వస్తున్నారు. మొన్నటికి మొన్న రెండు చేతులుజోడించి వేడుకుంటున్నానని దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చిన ఆయన..తాజాగా గురుద్వారాకు వెళ్లటం.. ఎలాంటి సెక్యురిటీ లేకుండా వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా చేస్తున్న రైతు ఉద్యమం పంజాబ్.. హర్యానాకు చెందిన రైతులు పెద్ద ఎత్తున రావటం.. వారంతా సిక్కు వర్గానికి చెందిన వారు కావటంతో.. వారితో తనకెలాంటి పంచాయితీ లేదన్న విషయాన్ని గురుద్వారాకు వెళ్లటం ద్వారా తేల్చేశారు.

అన్నింటికి మించి తనతో పాటు పెద్ద ఎత్తున భద్రతను తీసుకెళ్లకుండా తానెంత వినయశీలి అన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. ఆయన సందర్శించిన గురుద్వారాకు వచ్చిన ఇతర సిక్కులు.. ఆయనతో ఫోటోల కోసం పోటీ పడ్డారు. వారందరితో ఫోటోలు దిగటం ద్వారా ఆయనిచ్చిన సందేశం ఏమంటే..  తనకు సిక్కు సమాజానికి ఎలాంటి పంచాయితీ లేదని . అంతేకాదు.. సిక్కుల్లో తనకున్న  ఆదరణ తక్కువేమీ కాదన్న విషయాన్ని చెప్పేశారు.

మోడీఏ పని చేసినా లెక్కలు వేరుగా ఉంటాయి. అందులోకి ఇలా షెడ్యూల్ లేకుండా చేసే పనుల వెనుక ఆ మాత్రం వ్యూహం లేకుండా చేస్తారా ఏమిటి? ఇంతకీ గురుద్వారా పర్యటన రానున్న కొద్ది రోజుల్లో మోడీ ఏం సాధించాన్న విషయం కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు. అసలీ వేడుకోవటాలు.. గురుద్వారాలు సందర్శించే బదులు రైతుల ఇష్యూల్ని సెటిల్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయేది కదా?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.