బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్న మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రులపై విమర్శలతో విరుచుకుపడ్డారు. భారత్ మాతాకీ జై నా ఆంధ్రా కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని మోడీ ప్రారంభించారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని చూస్తే సంతోషంగా ఉందని ఇంత మంది జనం రావడం ఆనందంగా ఉందని మోడీ అన్నారు. ఇక విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పేరును స్మరించుకొని తన ప్రసంగాన్ని మోడీ ప్రారంభించారు.
రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే గెలుపని, 400 సీట్లు టార్గెట్ గా ప్రణాళికలు రచించామని మోడీ చెప్పారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి రావడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి విజయభేరి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత తాను పాల్గొంటున్న తొలి సభ ఇదేనని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీస్సులు తనతో ఉన్నట్లుగా భావిస్తున్నానని మోడీ అన్నారు. ముచ్చటగా మూడోసారి తమ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ లక్ష్యం వికసిత భారత్ అని వికసిత ఆంధ్రప్రదేశ్ అని అన్నారు.
ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇండియా కూటమిలో సభ్యులది యూజ్ అండ్ త్రో పాలసీ అంటూ చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీకి విజన్ లేదని, ఒకరినొకరు తిట్టిపోసుకుంటారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ జగన్ సర్కార్ పై మోడీ మండిపడ్డారు. రాష్ట్రంలోని మంత్రులు ఒకరిని మించి మరొకరు అవినీతి చేయడంపై దృష్టి సారించారని అందుకే ఈ ప్రభుత్వాన్ని పెకలించాలని ప్రజలు భావిస్తున్నట్టు తనకు అర్థమైందని మోడీ అన్నారు. గత ఐదేళ్లలో ఏపీ అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటూ జగన్ ప్రభుత్వం పై ప్రధాని విమర్శలు గుప్పించారు.
ఏపీ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు ఎన్డీఏ కూటమికి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీలో జగన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేర్వేరు కాదని ఒకే ఒరలో రెండు కత్తులని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపిపై ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు మళ్ళించేందుకే చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని అందుకే కూటమికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.