వినేందుకు విచిత్రంగా ఉంటుంది కానీ.. ఏది ఉత్తినే జరగదు. ప్రతి విషయానికి ఏదో ఒక లింకు పెట్టి రాయటం ఎక్కువైందన్న చిరాకును కొందరు ప్రదర్శిస్తుంటారు. రాజకీయాల్లో జరిగే ప్రతి పరిణామం వెనుక ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ ఉండదకుండా ఉండదు. ఈ విషయంపై అవగాహన లేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వస్తున్నట్లుగావార్తలు రావటం.. తర్వాత ఆయన ప్రోగ్రాంను ఖరారు చేయటం తెలిసిందే. కీలకమైన గ్రేటర్ ఎన్నికల పోలింగ్ కు సరిగ్గా మూడు రోజుల ముందు హైదరాబాద్ కు రావటం ఆసక్తికరంగా మారింది.
తన హైదరాబాద్ పర్యటనలో మోడీ ప్రోగ్రాం షెడ్యూల్ చూస్తే.. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ను సందర్శించటం.. వ్యాక్సిన్ తయారీ ఎంతవరకు వచ్చిందన్న వివరాలతో పాటు.. క్లినికల్ టెస్టుల అంశాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. దేశ ప్రధానమంత్రి ఒక సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ కోసం రావటమా? అంటే.. అదే లెక్క మరి.
ముంగిట్లో ఉన్న ఈ సంస్థను ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించలేదు సరి కదా.. ఆ ప్రతినిధులతో భేటీ అయ్యింది కూడా లేదు. కానీ.. అక్కడెక్కడో ఢిల్లీలో ఉండే ప్రధాని మాత్రం వారి వివరాలు తెలుసుకోవటమే కాదు.. తానే స్వయంగా వచ్చి.. పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేయటం ద్వారా.. కేసీఆర్ లో లేనిది.. తనలో ఉన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేశారని చెప్పాలి. వాస్తవానికి ఈ సంస్థ ల్యాబ్ ను కొన్ని నెలల క్రితం మంత్రి కేటీఆర్ సందర్శించటమే కాదు.. వ్యాక్సిన్ తయారీ.. పరిశోధనకు సంబంధించిన వివరాలు సేకరించారు. అప్పట్లో ఆ అంశానికి పెద్దగా ప్రాధాన్యత లభించలేదు.
ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యాక్సిన్ ప్రయోగానికి సంబంధించిన వివరాల్ని దేశ ప్రధాని స్వయంగా వచ్చి తెలుసుకోవటానికి ఇచ్చిన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కానీ.. రేపే (శనివారం) ఎందుకు రావాలి? అన్నది మరో ప్రశ్న. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదనలు ఆసక్తికరంగా మారాయి. రేపు సాయంత్రం ఎల్ బీ స్టేడియంలో గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఒకే ఒక్క బహిరంగ సభ. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. కేసీఆర్ బహిరంగ సభ సమయంలోనే ప్రధాని వచ్చి వెళ్లటం ఉంటుంది.
శనివారం మధ్యాహ్నం 2.40 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్సు స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జీనోమ్ వ్యాలీలోని ఎయిర్ ఫోర్సు స్టేషన్ కు చేరుకుంటారు. సాయంత్రం 4.10 గంటల నుంచి 5.10 గంటల వరకు భారత్ బయోటెక్ యూనిట్ లో ఉండనున్నారు. తిరిగి 5.35 గంటలకు హకీంపేటకు వెళ్లి.. ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. అదే సమయంలో.. సీఎం కేసీఆర్ ఎన్నికల సభ నిర్వహించనున్నారు.
కాస్త లోతుల్లోకి వెళితే.. ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ కు రావటమే ప్రాధాన్యత అంశంగా మారితే.. ఆయన వస్తున్నది కరోనా వ్యాక్సిన్ ప్రయోగం ఎంతవరకు వచ్చిందన్న వివరాల్ని తెలుసుకోవటం కోసం కావటంతో.. జాతీయ.. అంతర్జాతీయ మీడియా ఈ అంశానికి ఇచ్చే ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. అలాంటిది ప్రాంతీయ మీడియా ఇచ్చే ప్రయారిటీ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఎప్పుడైనా తెలంగాణలో కానీ.. ఏపీలో కానీ కీలకమైన సభను ఎవరైనా ఏర్పాటు చేస్తే.. దాని కారణంగా తెలంగాణ అధికార పక్షానికి ఇబ్బంది కలుగుతుందని భావిస్తే.. సరిగ్గా అదే రోజున.. తాము మరో ప్రోగ్రాంను ఏర్పాటు చేయటం గులాబీ బాస్ కేసీఆర్ కు అలవాటు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఆయన ఇలాంటి తీరునే ప్రదర్శిస్తుంటారు. కావాలని చేస్తున్నారో లేదంటే కాకతాళీయంగా జరుగుతుందో కానీ గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం కీలకమైన బహిరంగ సభను సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న రోజున.. దాదాపుగా అదే సమయంలో ప్రధాని మోడీ హైదరాబాద్ కు వచ్చి వెళ్లటం చూసినప్పుడు లెక్క తేడాగా అనిపించట్లేదు?