దిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. దిల్లీలో ఆయన్ను అరెస్ట్ చేశారు. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్‌కు చెందిన కొన్ని రిటైల్, హోల్ సేల్ సంస్థలకు వాటి యజమానులకు లబ్ధి చేకూర్చేలా బుచ్చిబాబు ఈ పాలసీకి సూచనలు చేశారన్న ఆరోపణలతో ఆయన్ను అరెస్ట్ చేశారు.
కాగా బుచ్చిబాబు అరెస్ట్‌తో సీబీఐ త్వరలో మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని.. కవిత అరెస్ట్ కూడా ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఆమెతో పాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు.. విజయసాయిరెడ్డి బంధువు పేరు కూడా ఈడీ రిమాండ్ రిపోర్టులో ఉంది. దిల్లీ లిక్కర్ ‘కుంభకోణం’ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అమిత్ అరోరాను దిల్లీలోని రౌస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఆమె పేరు ఉంది.
అమిత్ అరోరాను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించింది. ఈడీ రిపోర్ట్ ప్రకారం… దిల్లీలో మద్యం అమ్మకాల లైసెన్స్ తీసుకున్న వాటిలో మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. దానిని మాగుంట రాఘవ్ నడుపుతున్నారు. శరత్ రెడ్డికి చెందిన శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్ లిమిటెడ్, ట్రైడెంట్ కెమాఫర్, ఆర్గోనామిక్స్ ఈకోసిస్టమ్స్ కంపెనీలు లైసెన్స్ తీసుకున్నాయి.
ఈ కేసులో ఈడీ అనుమానిస్తున్న వాళ్లు తరచూ ఫోన్లు మార్చినట్లుగా కూడా రిపోర్టులో పేర్కొన్నారు. కల్వకుంట్ల కవిత 10, అభిషేక్ బోయినపల్లి 5, గోరంట్ల బుచ్చిబాబు 6, శరత్ రెడ్డి 9 ఫోన్లు మార్చినట్లు ఈడీ తెలిపింది.
తాజాగా బుచ్చిబాబు అరెస్టుతో ఈ కేసులో వేగం పెరగడంతో రాజకీయంగా గుబులు మొదలైంది. ముఖ్యంగా కవిత చుట్టూ కేసు బిగిస్తున్నట్లుగా దిల్లీ రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.