బీఆర్ ఎస్ నాయకురాలు.. ఎమ్మెల్సీ కవిత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. దీనిని తాను విభేదిస్తున్నట్టు చెప్పారు. వాస్తవానికి ఈ ప్రతిపాదన తాను లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్టయి.. జైల్లో ఉన్నప్పుడే తెరమీదకి వచ్చిందన్నారు. అయితే.. అప్పట్లో తాను గట్టిగా దీనిని విభేదించానని చెప్పారు. కానీ, ఇప్పుడు కూడా ఈ ప్రతిపాదనను తెరమీదికి తెస్తున్నారని చెప్పారు.
అందుకే తాను.. బీఆర్ ఎస్ ప్లీనరీలో బీజేపీని ఎందుకు విమర్శించలేదని.. గట్టిగానే ప్రశ్నించానన్నారు. తెలంగాణ అస్థిత్వం కోసం పుట్టిన పార్టీని కేంద్ర పార్టీలో విలీనం చేయడాన్ని తెలంగాణ సమాజం అంగీకరించబోదన్నారు. అందుకే.. కేసీఆర్ బిడ్డగా.. ఆ ఇంటి ఆడపడుచుగా.. బీఆర్ ఎస్ నాయకురాలిగా తాను అడ్డుకున్నానన్నారు. కడుపులో విషం పెట్టుకుని కొందరు నవ్వుతూ మాట్లాడుతున్నారని.. అలా తనకు చేతకాదని అందుకే కేసీఆర్‌కు లేఖరాశానని ఆమె చెప్పుకొచ్చారు.
ఇదేసమయంలో కేసీఆర్ చుట్టూ లీకువీరుడు కాదు.. లీకు వీరులు ఉన్నారంటూ మరో సంచలన వ్యాఖ్య చేశారు. తాను ఇప్పటికి కొన్ని వందల లేఖలు రాసి ఉంటానని.. అయితే.. ఏలేఖ రాసినా కేసీఆర్ దానిని చింపేస్తారని.. కానీ, తాజా లేఖను మాత్రం ఎందుకు చింపలేదో తనకు అర్ధం కావడం లేదని వ్యాఖ్యానిం చారు. దీనిని లీకు వీరుడు బయటకు లీకు చేశాడా? లేక లీకు వీరులే బయటకు వదిలా ? అనేది తేలాల్సి ఉందని.. దీనిని పార్టీ అధినేత కేసీఆర్ చేయాలని ఆమె చెప్పారు.
తాను.. పార్టీ మారడం అనేది లేదన్నారు. తాను బీఆర్ ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కొన్ని పెయిడ్ సోషల్ మీడియాలకు డబ్బులు ఇచ్చి తనపై వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారని కవిత ఆగ్రహించారు. తా ను కాంగ్రెస్‌లో చేరుతున్నానని, రాయబారం చేస్తున్నానని చెబుతున్నారని.. కానీ అవన్నీ శుద్ధ అబద్ధాలని ఆమె కొట్టి పారేశారు. తెలంగాణ కోసం.. అనేక త్యాగాలు చేశానని చెప్పారు.
కేటీఆర్ ను కవిత పరోక్షంగా టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు నోటీసులిస్తే ఎక్స్ లో పోస్టులు పెడితే సరిపోతుందా అని తన సోదరుడు కేటీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా కవిత చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.