జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి కయ్యానికి కాలు దువ్విన సంగతి తెలిసిందే. నీది ఏ పార్టీ అంటూ సంజయ్ పైకి కౌశిక్ రెడ్డి దూసుకువెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు. తనపై కౌశిక్ రెడ్డి దుర్భాషాలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నందుకుగాను అతడిపై చర్యలు తీసుకోవాలని సంజయ్ కోరారు. సంజయ్ ఫిర్యాదుపై స్పీకర్ ప్రసాద్ స్పందించారు. ఆ ఘటనపై పూర్తి నివేదిక తెప్పించిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేరు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కూడా గతంలో చేర్చుకుందని, అలా చేసినందుకు కేసీఆర్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత వారు తమ పదవులకు రాజీనామా చేయాలని, అప్పుడు తన పదవికి తానూ రాజీనామా చేస్తానని చెప్పారు. ఆ సమీక్షా సమావేశంలో కౌశిక్ రెడ్డి వీధి రౌడీలా ప్రవర్తించారని సంజయ్ విమర్శించారు. అయితే, కౌశిక్ రెడ్డి స్వతహాగా అలా చేశారా? ఎవరైనా రెచ్చగొడితే చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు.