అధికారం చేతికి వచ్చినంతనే బాధ్యతతో వ్యవహరించేటోళ్లు ఉంటారు. అదే సమయంలో ఆ పవర్ ను తలకు ఎక్కించుకొని చెలరేగిపోతుంటారు. తాజాగా చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిసిన తర్వాత.. ఈ ఉదంతం ఏ కోవకు వస్తుందో ఎవరికి వారు డిసైడ్ చేసుకోవచ్చు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలుసు కదా? ఆయన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు అక్షరాల మేనమామ. మరి.. అలాంటి ఆయన్ను పట్టుకొని సమస్యల పరిష్కారం కోసం అడిగితే కోపం రాదా?
పెద్దోళ్ల విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. వారి మూడ్ కు తగ్గట్లుగా నడుచుకోవాలి. పబ్లిక్ లో ఉన్నప్పుడు సమస్య తీరటం లేదని ప్రశ్నించకూడదు. కావాలంటే.. వారిని ప్రాధేయ పడాలి. అవసరమైతే కాళ్ల మీద పడాలి. మీరు మాత్రమే దిక్కు.. మా సమస్యలు మీరు అనుకుంటేనే తీరుతాయి. మా బతుకులు మీ సొంతం. అంటూ కాలికింద చెప్పు మాదిరి అణిగిమణికి ఉండాలే తప్పించి.. ఇంతకాలంగా నా సమస్య ఎందుకు పరిష్కారం కాదు? అన్న ధర్మాగ్రహం అస్సలు ఉండకూడదు.
అయితే.. ఇలాంటి విషయాల్లో ఎలా వ్యవహరించాలో తెలీని దేశాయ్ రెడ్డి అనే వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. జగన్ పిలుపు మేరకు అధికార పార్టీకి చెందిన నేతలు నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మేనమామ.. కమ్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలంలోని అలిదెన గ్రామంలో కొద్ది రోజుల క్రితం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశాయ్ రెడ్డి.. తన భూమి సర్వే నంబర్లు రికార్డుల్లో నమోదు చేయటం లేదన్నారు. తన సమస్య ఎంతోకాలంగా ఉందని.. దాన్ని పరిష్కరించాలని కోరారు.
అయితే.. సదరు వ్యక్తి చేసిన పొరపాటు ఏమంటే.. ఎమ్మెల్యే గారు తహసీల్దార్ ఉదయభారతితో మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగలటమేనని చెబుతున్నారు. దీంతో.. కోపానికి పోయిన ఎమ్మెల్యే.. ప్రశ్నించిన వ్యక్తిపై చేయి చేసుకోవటమే కాదు.. రాయలేని బూతులు తిట్టటం మొదలు పెట్టారు. ఈ ఉదంతాన్ని గుట్టుగా రికార్డు చేసిన సొంత పార్టీకి చెందిన నేత ఒకరు.. కాస్త ఆలస్యంగా బయటపెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయినా.. సమస్య పరిష్కారం కోసం కోరేవారు.. ఎంత వినమ్రంగా వ్యవహరించాలి? ఆ విషయాన్ని తెలుసుకోవటంలో తప్పు జరిగినప్పుడు.. ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు. కాదంటారా?