రాష్ట్రంలో నానాటికీ వైసీపీ నేతలపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రజల ముందుకు వెళ్లేందుకు వైసీపీ నేతలు జంకుతున్నారు. తమను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండడంతోజనం ముందుకు వెళ్లేందుకు వారు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే తమకు జగన్ అప్పగించిన అదనపు బాధ్యతల నుంచి వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా తప్పుకుంటున్న వైనం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి పత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి వైసీపీ కీలక నేత, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా చేశారు. ఈ ప్రకారం తన రాజీనామా లేఖను వైసిపి అధినేత జగన్ కు రామచంద్రా రెడ్డి పంపించారు.
ఇటీవల తన అల్లుడు మంజునాథరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని, ఈ క్రమంలో తన కుటుంబమంతా తీవ్ర విషాదంలో కూరుకుపోయిందని ఆ లేఖలో వివరించారు. ఈ క్రమంలోనే అటు నియోజకవర్గంతో పాటు పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించడం కష్టతరంగా మారిందని రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. అందులోనూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గంలోని సమస్యలపై నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రామచంద్రా రెడ్డి అన్నారు.
ఈ క్రమంలోనే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలను పర్యవేక్షించలేనని, ఆ పదవిని మరో నేతకు అప్పగించాలని జగన్ ను రామచంద్రారెడ్డి కోరారు. అయితే, పైకి ఇలా వ్యక్తిగత కారణాలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వంపై నానాటికి పెరిగిపోతున్న వ్యతిరేకత నేపథ్యంలోని ఇలా పార్టీ పదవులను వీడుతున్న నేతల సంఖ్య పెరిగిపోతుందని విమర్శలు వస్తున్నాయి. మరి రామచంద్రా రెడ్డి రాజీనామాను జగన్ ఆమోదిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.