ఏపీ అధికార పార్టీ వైసీపీ లో ఒకవైపు టికెట్ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న నాయకులు కనిపి స్తుంటే.. మరోవైపు టికెట్‌పై ఆశలు ఉన్న నాయకులు అసలు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? వారికి ఏం చెప్పి ఓట్లడగాలంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు.. తమ నియోజకవర్గం సమస్యలపై మంత్రులకు చెప్పినా పనులు జరగలేదని.. ఇప్పుడు ఎన్నికల ముందు.. స్థానిక సమస్యలపై ప్రజలు నిలదీస్తే ఎలాంటి సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం శింగనమల నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న జొన్నలగడ్డ పద్మావతి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఫేస్బుక్ లైవ్‌లోనే పద్మావతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుత ప్రభుత్వంలో ఎస్సీలకే ఎక్కువగా అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా? అప్పుడే నిధులు ఇస్తారా? అని ఎమ్మెల్యే పద్మావతి ప్రశ్నించారు.
ఏం జరిగింది?
శింగనమల నియోజకవర్గం.. సహజంగానే సాగునీటి సమస్యలు ఎదుర్కొంటోంది. ఇక్కడి రైతులకు రావాల్సిన నీరు.. రావడం లేదు. పైగా ఇక్కడి నీటినీ.. కొన్ని కారణాలతో ఎక్కడో ఉన్న కుప్పం నియోజకవర్గానికి తరలిస్తున్నారు. ఇదే ఎమ్మెల్యే ఆవేదనకు.. విమర్శలకు దారి తీసింది. శింగనమల నియోజకవర్గంలోని రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతుంటే కుప్పానికి నీళ్లు ఎలా తీసుకువెళ్తారన్నది ఆమె ప్రశ్న.
అంతేకాదు.. ఈ విషయాన్ని గతంలో అనేక మార్లు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరిచానని అయినా.. ఆయన పట్టించుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దలకు ముఖ్యంగా రైతాంగం దగ్గరకు ఎలా వెళ్తామని పద్మావతి ప్రశ్నించారు. ఒక్క రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఓట్లు వేస్తే తాను ఎమ్మెల్యే కాలేదని వ్యాఖ్యానించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ విషయం సస్పెన్స్‌లో పెట్టింది. అందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.