దేశం కోసం నిర్విరామంగా సేవలు అందిస్తున్న ఆర్మీ కోసం తాజాగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన ఐదు నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ఆధ్వర్యంలో దేశ సైనికులకు సంఘీభావంగా ఆళ్లగడ్డలో తిరంగా ర్యాలీ జరిగింది. కుల, మత, పార్టీలకు అతీతంగా నియోజకవర్గం లోని ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తితో పులకించిపోయారు.
భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల్లో అమర వీరుడైన తెలుగు జవాన్ మురళి నాయక్ కు అఖిల ప్రియతో సహా మరికొందరు ముఖ్య నేతలు నివాళులర్పించారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు క్యాండిల్స్ తో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ కీలక ప్రకటన చేశారు.
పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదులను మట్టు పెట్టడానికి మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అఖిల ప్రియ అభిప్రాయపడ్డారు. ప్రాణాలనే పణంగా పెట్టి దేశాన్ని, దేశ ప్రజలను రక్షిస్తున్న భారత జవాన్లకు తన ఐదు నెలల వేతనాన్ని ఆమె విరాళంగా ప్రకటించారు. తనలోని దేశభక్తిని చాటుకున్నారు. అఖిల ప్రియ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండియన్ ఆర్మీ కోసం టీడీపీ మహిళ ఎమ్మెల్యే వేసిన ఈ అడుగు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అభినందిస్తున్నారు.