తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గెలుపు మాదంటే మాది అని అధికార బీఆర్ఎస్ పార్టీతోపాటు, ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ సర్వేలు నిర్వహించే ‘మిషన్ చాణక్య’ సంస్థ అధినేత పార్థా దాసు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, రాబోయే ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా వరంగల్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. నవంబర్ 24న కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించబోతున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశాలలో కూడా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆ ప్రభావం ఇండియా కూటమి బలోపేతం అయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తరాదిలో 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలలో ఇండియా కూటమి బలంగా మారే అవకాశాలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే దేశంలోని రాజకీయ పరిణామాలు ముందు ముందు ఆసక్తికరంగా మారబోతున్నాయని పార్థా దాసు చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో సంచలనం రేపుతోంది. వాస్తవానికి కొద్ది నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల ఫలితాలు పార్థా దాసు అంచనాలకు దగ్గరగా ఉన్నాయి. కన్నడనాట కాంగ్రెస్ పార్టీ 120కి పైగా సీట్లు సాధిస్తుందని పార్థా అంచనా వేయయగా, ఆ పార్టీ 135 సీట్లు కైవసం చేసుకుంది.