తెలంగాణ రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేటలో భాగంగా దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఉన్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి ` మా సీతక్క` అంటూ గౌరవంగా పిలుచుకునే మంత్రి సీతక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కార్యాలయమైన ప్రజాభవన్‌కు వెళ్లిన సీతక్క ఈ సందర్భంగా ఆయనతో సమావేశమయ్యారు. తన శాఖకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు తెలిపారు.
గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం, ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్కను ప్రజా భవన్ లో కలిసి పూల మొక్క అందచేసి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం తమ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి సీతక్క కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం సందర్భంగా పల్లెల అభివృద్దికి పెద్ద పీఠ వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సహచర మంత్రులకు ధన్యవాదాలు తెలిపినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.
గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తున్నది తెలిపిన సీతక్క ఇటు రోడ్ల నిర్మాణానికి వేల కోట్ల నిధులు, అటు ఇంజనీర్లకు వాహన సదుపాయం కల్పించామని వెల్లడించారు. గతంలో రూ. 2682.95 కోట్లను మంజూరు చేయగా పనులు కొనసాగుతుండగా గురువారం మరో రూ. 2773 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. రూ. 2773 కోట్ల నిధులలో బీటీ రోడ్లు, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం, తండాలు, గూడేల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గ్రామీణాభివృద్దికి మా ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపిన సీతక్క ఎన్నడు లేని విధంగా నిధులు మంజూరు చేసి పనులు చేయిస్తున్నామని తెలిపారు. పల్లెల్లో రోడ్లు, డ్రేనేజీలు, ఇతర మౌళిక వసతుల కల్పన కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపిన సీతక్క రాబోయే కాలంలో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని తెలిపారు.
తమ ప్రభుత్వం క్షేత్ర స్ధాయి పంచాయతీ రాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం కల్పించిందని తెలిపారు. వాహన సదుపాయం కల్పించిన ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని పంచాయతీ రాజ్ విభాగ ఈఎన్సీ కనకరత్నం ఈ సందర్భంగా వెల్లడించారు. గతంలో వాహన అలవెన్స్ లేకపోవడంతో ఇంజనీర్లు అవస్థలు పడ్డారని, వాహన కష్టాలు తీర్చిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతల అని కనకరత్నం తెలిపారు.