మంత్రి విడదల రజనీ ఈ సారి ఓటమి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతూ ఈ ఓటమి నుంచి విడదలయ్యే పరిస్థితులు కనపడడం లేదు. కీలకమైన వైద్య ఆరోగ్యశాఖా మంత్రిగా ఉండి చిలకలూరిపేటలో ఐదేళ్ల పాటు ఆమె అభివృద్ధి కంటే ప్రచారం నమ్ముకున్న పరిస్థితి. ప్రభుత్వ, పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో రజనీ ఆడింది ఆట పాడింది పాటగా మారింది. కట్ చేస్తే ఎన్నికలకు ఐదారు నెలల ముందే ఈ సారి రజనీ పేటలో చిత్తుగా ఓడిపోతారన్న విషయం అర్థమయ్యే ఆమెను ఆఘమేఘాల మీద గుంటూరు వెస్ట్‌కు మార్చారు. రజనీని వెస్ట్‌కు మార్చాక పేట వైసీపీ రాజకీయం మరింత రచ్చగా మారింది.
దీంతో ఆ ప్రభావంతో అటు పేటలో మాత్రమే కాదు… ఇటు గుంటూరు వెస్ట్‌లోనూ రజనీ సొంత పార్టీ నేతలతో పాటు సాధారణ జనాల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారు. రజనీ చిలకలూరిపేటలో గత ఎన్నికల్లో కాపు + బీసీ ఈక్వేషన్‌తో ప్రచారం చేసుకున్నా కూడా పుల్లారావుపై కేవలం 8 వేల ఓట్ల మెజార్టీతో అది కూడా అంత వేవ్ ఉండి గట్టెక్కారు. ఈ సారి గుంటూరు వెస్ట్‌కు మారిన వెంటనే అదే రాజకీయం మొదలు పెట్టారు.
గురి చూసి కొట్టిన చంద్రబాబు…
తన గురువు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దయతో రాజకీయాల్లోకి వచ్చిన రజనీ తాను సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిని చెట్టు ముక్కను అంటూ చెప్పుకుని బాగా పాపులర్ అయ్యారు. అలా రాజకీయంగా జన్మనిచ్చిన తెలుగుదేశం పార్టీని గత ఎన్నికలకు ముందే దెబ్బకొట్టిన రజనీ వైపీపీలోకి వెళ్లి ఎమ్మెల్యే, మంత్రి పదవులు తెచ్చుకున్నారు. సరే ఆమె అభివృద్ధి అంతా సోషల్ మీడియాకే పరిమితం తప్పా పేటకు ఆమె ఏం చేశారని ప్రశ్నించుకుంటే ? ఆన్సర్ లేదు. పేటలో నిన్నటి వరకు వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న ఆమె బంధువు మల్లేల రాజేష్ నాయుడే దీనిపై ఆమెను ప్రశ్నిస్తున్నారంటే ఆమె డవలప్ మెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఒక కొడాలి నాని, ఒక వంశీ ఇలాంటి వాళ్లంతా టీడీపీతో ఫేమ్ తెచ్చుకుని వైసీపీలో పదవులు దక్కించుకుని.. తర్వాత టీడీపీ, చంద్రబాబుపై ఏ స్థాయిలో విమర్శలు చేశారో.. వాళ్లపై టీడీపీ వాళ్లలో, సాధారణ జనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇప్పుడు విడదల రజనీపై అంతే వ్యతిరేకత ఉంది. నాని, వంశీ ఓటమి మాత్రమే కాదు.. రజనీ ఓటమి కోరుకుంటోన్న టీడీపీ కార్యకర్తలు, సాధారణ జనాలు కూడా చాలా మందే ఉన్నారు. ఇక రజనీ టీడీపీని కొట్టిన దెబ్బకు ఆమెను చిత్తుగా ఓడించేలా చంద్రబాబు వేసిన స్కెచ్‌లో ఆమె విలవిల్లాడుతోన్న వాతావరణం గుంటూరు వెస్ట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
మాధవికి కలిసొస్తోన్న కాలం…
వెస్ట్‌లో ఈ సారి కులాల ఈక్వేషన్లు చూసుకున్నా… రాజధాని మార్పు ప్రభావం… వైసీపీ పాలనలో జీరో అభివృద్ధి, ఆ పార్టీలో గ్రూపుల గోల… ఇటు బీసీల్లో వెనకపడిన వర్గాలకు చెందిన మాధవికి సీటు ఇవ్వడం ఇలా అన్నీ అనుకూలతలతో మాధవి జోరుమీదుండగా… రజనీకి చుక్కలు కనపడుతున్నాయి. 2019లో చిలకలూరిపేటలో రాజకీయం చేసినంత ఈజీ కాదు గుంటూరు వెస్ట్‌లో అన్న విషయం రజనీకి చాలా త్వరగానే అర్థమైనట్టు ఉందని.. అందుకే ప్రజాక్షేత్రంలో ప్రజా బలంతో ఇక్కడ పనికాదని.. ఆమె విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ రాజకీయం చేసే పనిలో బిజీగా ఉన్నట్టు వెస్ట్ నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రజనీ కాలు కదిపినా.. చేయి మెదిపినా కూడా అంతా డబ్బుతోనే నడిపిస్తున్నారన్న చర్చ కూడా స్థానికంగా అందరి నోటా వినిపిస్తోంది.
ఇటు మాధవి బీసీల్లో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో పాటు ఉన్నత విద్యావంతురాలుగా ఉండడం, తన హాస్పటల్స్ ద్వారా ఎంతోమంది నిరుపేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చేసిన సేవల నేపథ్యంలో బీసీలు మాత్రమే కాదు… నియోజకవర్గంలో బలంగా ఉన్న కాపులు జనసేన వైపు పూర్తిగా టర్న్ కావడం, ఇటు వైశ్య, బ్రాహ్మణ, ఎస్సీ వర్గాలు.. అటు ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎవరి నోట విన్నా.. ఎక్కడ చర్చ జరుగుతున్నా ఈ సారి గుంటూరు వెస్ట్‌లో మాధవి గెలిచి తీరుతుందనే అంటున్నారు. అటు సైబరాబాద్ మొక్క తుక్కు తుక్కయిపోతుందనే మాటే ఎక్కువుగా వినిపిస్తోంది.