తెలంగాణలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గన్మెన్ ఏఆర్ ఎస్ఐ ఫజల్ పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే మంత్రి సబిత అక్కడకు చేరుకుని పరిశీలించారు.
ఇదిలావుంటే, అసలు గన్మెన్ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి. సాధారణంగా ఉద్యోగంలో ఒత్తిడి, ఉన్నతాధికారుల వేదింపులతో ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. కానీ, ఫజల్ విషయంలో మాత్రం తీసుకున్న అప్పు చెల్లించలేక పోవడం.. లోన్ రికవరీ ఏజెంట్లు ఆయనను వెంటాడడంతో విసుగు చెంది.. ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
శ్రీనగర్ కాలనీలో గన్మెన్ ఫజల్ నివాసం ఉంటున్నాడు. కుటుంబ అవసరాల నిమిత్తం ఫజల్ లోన్ యాప్లో కొంత నగదు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నగదు కోసం లోన్ యాప్ నిర్వాహకులు తరచూగా ఫోన్ చేస్తూ వేధిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్థాపనికి గురయిన ఫజల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు.. ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఫజల్ కుమార్తె కూడా అక్కడే ఉన్నారు. కన్నబిడ్డ ముందే ఏఎస్ఐ ఫజల్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు కూడా నిర్ధారించారు. శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ దగ్గర ఆదివారం తెలతెల వారుతూనే జరిగిన ఈ ఘటన స్థానికంగాను తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. గన్మెన్ ఆత్మహత్యతో మంత్రి సబితారెడ్డి తీవ్ర బావోద్వేగానికి గురయ్యారు.