ఏ చిన్న అవకాశం వచ్చినా ఏదో ఒక వ్యాఖ్య చేయటం.. ఏపీ మీద తనకున్న అక్కసును వెళ్లగక్కే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా ముగిసిన పార్టీ ప్లీనరీ సభలో మాట్లాడుతూ.. ఏపీలో పార్టీ పెట్టమని అడుగుతున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ వ్యాఖ్య మీద సీఎం కేసీఆర్ కు అనూహ్యమైన రీతిలో కౌంటర్లు వస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి పేర్నినాని వేసిన పంచ్.. గులాబీ బాస్ కు దిమ్మ తిరిగిపోయేలా ఉంది. ఏపీలో తమ పార్టీని పెట్టాలని పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని.. పార్టీ పెడితే గెలిపించుకు వస్తున్నామంటూ తమ పాలనకు ఏపీ ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందన్న విషయాన్ని దర్పంగా చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్.
తమ పాలన అద్భుతంగా ఉందని చెప్పటం వేరు.. పక్క రాష్ట్రాన్ని పోలుస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిన్నబుచ్చేలా గొప్పలు చెప్పటం వేరు. ఈ చిన్నలాజిక్ ను మిస్ అయిన కేసీఆర్.. వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడిన మాటలకు.. ఊహించని రీతిలో కౌంటర్లు వస్తున్నాయి. తాజాగా ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీని కొత్తగా పెట్టాల్సిన పని ఏముంది? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి.. రెండు రాష్ట్రాల్ని కలిపేస్తే సరిపోతుంది కదా? ఉమ్మడి రాష్ట్రంగా ఉందాం.. అక్కడ ఇక్కడ ఒకే పార్టీ ఉంటుంది. కొత్తగా పార్టీ పెట్టే పనే ఉండదని వ్యాఖ్యానించారు.
ఇక్కడితో ఆగకుండా.. ఇదే విషయం మీద మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఏపీ తెలంగాణ కలిపేసిన తర్వాత ఎవరికి ఓటేస్తే వారు సీఎం అవుతారని.. 2013లోనే ఏపీని దుర్మార్గంగా విభజించొద్దని.. సమైక్య రాష్ట్రం తెలుగు వారికి అవసరమని జగన్ చెప్పారని గుర్తు చేశారు. ‘‘ఇవాళ కేసీఆర్ అక్కడా.. ఇక్కడా పోటీ చేయాలని అందరూ కోరుకుంటున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర ప్రస్తావిస్తే నిజాలు తెలుస్తాయి. ఊళ్లో పల్లకీల మోత.. ఇంట్లో ఈగల మోత సామెతలా ఉంది’’ అని మండిపడ్డారు. మొత్తంగా చూస్తే..ఏపీలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నారన్న కేసీఆర్ మాటలకు.. మళ్లీ మాట్లాడలేని విధంగా పంచ్ ల మీద పంచ్ లు వేసిన పేర్ని నాని వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరి.. ఈ వ్యాఖ్యలకు కేసీఆర్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది అసలు ప్రశ్న.