కష్టంలో ఉన్నా.. కాపాడాలంటూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీరేంద్ర కుమార్ సెల్ఫీ వీడియోకు ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. భయపడొద్దు.. క్షేమంగా వెనక్కి తీసుకొస్తానంటూ ఆభయమిచ్చారు. చేసిన అప్పును తీర్చుకోవటానికి.. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న లక్ష్యంతో గల్ఫ్ కు వెళితే.. ఏజెంట్ మోసంతో అడ్డంగా బుక్ అయిన ఒక తెలుగు యువకుడు ఆవేదనతో పెట్టిన వీడియోకు స్పందించిన లోకేశ్.. అతన్ని వెనక్కి తీసుకొస్తానని.. ధైర్యంగా ఉండాలన్నారు.
తినేందుకు తిండి లేదని.. తాగేందుకు నీరు లేదని.. రక్తపు వాంతులు అవుతున్నాయని.. ముక్కు నుంచి రక్తం కారుతోందంటూ విన్నంతనే వణికిపోయే కష్టాల్ని ఏకరువు పెట్టిన 24 ఏళ్ల వీరేంద్ర కుమార్ ది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. ఇంటర్ వరకు చదువుకున్న వీరేంద్ర కుమార్ ఒక షోరూంలో పని చేసేవాడు. గల్ఫ్ కు వెళితే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చన్న ఉద్దేశంతో హైదరాబాద్ లోని ఒక ఏజెంట్ ద్వారా ఈ నెల పదిన ఖతార్ కు చేరుకున్నాడు.
ఇంట్లో వంట మనిషి ఉద్యోగమని చెప్పిన ఏజెంట్ మాటల్ని నమ్మి తాను మోసపోయినట్లుగా వీరేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఖతార్ లో ఉద్యోగమని చెప్పి సౌదీ అరేబియాలోని ఏడారి ప్రాంతంలో ఒంటెల వద్ద వదిలేశారన్నాడు. సరైన ఆహారం పెట్టట్లేదని.. తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయాడు. వారం రోజులకే తన ఆరోగ్యం దెబ్బ తిందన్న విషయాన్ని వెల్లడించిన వీరేంద్ర.. తనను ఆదుకోవాలని కోరాడు.
సోషల్ మీడియాలో పెట్టిన ఈ వీడియోకు చలించిన మంత్రి నారా లోకేశ్.. అతడ్ని క్షేమంగా వెనక్కి తీసుకొస్తానని పేర్కొన్నారు. ‘వీరేంద్ర.. ఆందోళన చెందొద్దు. నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొస్తాం’ అంటూ ఆభయమిచ్చారు. ఈ మధ్యనే అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన శివ సైతం ఇదే తరహాలో వేధింపులకు గురవుతుంటే కువైట్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఇప్పుడు వీరేంద్రకు అలాంటి ఆభయమిచ్చారు లోకేశ్. కష్టంలో ఉన్నానన్నంతనే స్పందిస్తున్న లోకేశ్ రియాక్షన్ పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.