ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ సాధారణంగా చాలా కూల్ గా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించినప్పటికీ ఎక్కడా సంయమనం కోల్పోరు. అటువంటి నారా లోకేష్ ను ఈరోజు శాసనమండలిలో వైసీపీ సభ్యులు రెచ్చగొట్టారు. ఈ క్రమంలోనే తొలిసారిగా శాసన మండలిలో లోకేష్ తన ఉగ్రరూపం చూపిస్తూ వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.
ఆనాడు చంద్రబాబు శాసనసభకు రాలేదని, ఈనాడు జగన్ కూడా రావడం లేదని పోల్చిన వైసీపీ సభ్యులపై లోకేష్ నిప్పులు చెరిగారు. ఆనాడు నిండు సభలో తన తల్లిని వైసీపీ సభ్యులు అవమానించారని, ఆ కారణంతోనే ఈ కౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాతే సభలో అడుగు పెడతానని చంద్రబాబు శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారని గుర్తు చేశారు. సింగిల్ గా సింహంలా సభకు వచ్చారని గుర్తు చేశారు. ఆనాడు చంద్రబాబు సభను బాయ్ కాట్ చేసినా..మిగతా టీడీపీ సభ్యులు వచ్చారని అన్నారు. కానీ, జగన్, పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సభకు ఎందుకు రావడం లేదని లోకేష్ ప్రశ్నించారు. దానికి, జగన్ సభకు రాకపోవడానికి ముడిపెట్టిన వైసీపీ సభ్యులపై లోకేష్ మండిపడ్డారు.
తన తల్లిని అవమానిస్తే చూస్తూ కూర్చోవాలా అంటూ వైసీపీ సభ్యులను ఏకీపారేశారు లోకేష్. షర్మిల గారిని, విజయమ్మ గారిని, తన తల్లిని అవమానించారని, అటువంటివారిని అరెస్టు చేస్తుంటే వైసీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యుల మాదిరిగా మాట్లాడేందుకు తమకు ఓ నిమిషం పట్టదని, కానీ ఏనాడూ తాము అలా సంస్కారహీనంగా మాట్లాడలేదని లోకేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి తాను గాని, తమ పార్టీ సభ్యులు గానీ ఎక్కడా మాట జారలేదని లోకేష్ గుర్తు చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సభ్యులపై లోకేష్ ఫైర్ అయిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లోకేష్ ఆన్ ఫైర్….వైసీపీ నేతలకు ఇక చుక్కలే అంటూ టీడీపీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అనవసరంగా లోకేష్ ను రెచ్చగొట్టారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు.