తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కుటుంబపాలన కొనసాగుతోందని, కేసీఆర్ తన సీఎం పదవిని కేటీఆర్ కు కట్టబెడుతున్నారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు. రసమయి బాలకిషన్ ను సీఎం చేయాలంటూ రేవంత్ రెడ్డి వంటి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలు టీపీసీసీ, టీబీజేపీ రాష్ట్రాధ్యక్షులుగా పదవులు అనుభవిస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ ను విమర్శించడంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు హద్దులు దాటుతున్నారని, అయినా టీఆర్ఎస్ నేతలు సంయమనం పాటిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఉద్యోగ నియామకాలపై ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని, కేసీఆర్ ను విమర్శించే నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ అన్నారు.
అయితే, కేటీఆర్ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాటిచ్చారని, కానీ, కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన తర్వాత కేటీఆర్ మాట నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. అసలు కాంగ్రెస్…తెలంగాణ ఇవ్వకుంటే…కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా….కేటీఆర్ మంత్రి అయ్యేవారా అని టీ కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. సొమ్మొకడిది…సోకొకడిది అన్న చందంగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే…ఆ క్రెడిట్ ను కేసీఆర్ తనదిగా చెప్పుకుంటూ బడాయికి పోతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. బాగుంది సంబడం…అసలు సోనియానే లేకుంటే…ఆమె కనికరించకుంటే…కేసీఆర్, కేటీఆర్, కవితలకు పదవులొచ్చేవా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. విపక్షాలను కేటీఆర్ విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలని అంటున్నారు.