హైదరాబాద్ మహానగరంలో మరో రాజకీయ హత్య చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి వేళలో చోటు చేసుకున్న ఈ హత్య సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఈ తరహా రాజకీయ హత్య చోటు చేసుకోలేదంటున్నారు. రాజేంద్రనగర్ అత్తాపూర్ లో మజ్లిస్ నేత ఖలీల్ ను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. రాళ్లు.. కత్తులతో వెంటబడి.. పరుగులు పెట్టించి మరీ నడిరోడ్డు మీదనే గొడ్డలితో నరికి మరీ చంపేశారు. స్థానికంగా తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. పాత కక్షలే హత్యకు కారణమని భావిస్తున్నారు. హత్య జరిగిన కాసేపటికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పిల్లర్ నెంబరు 248 వద్ద చోటు చేసుకున్న ఈ హత్యకు కారణమైన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఘటనా స్థలం దగ్గర్లోని సీసీ కెమేరాల్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే.. హత్య జరిగిన సమయం అర్థరాత్రికి దగ్గరగా ఉండటం.. చుట్టూ వెలుతురు సరిగా లేకపోవటంతో.. సీసీ కెమేరాల్లో దృశ్యాలు అంత స్పష్టంగా లేవంటున్నారు.హత్యకు కారణం ఏమిటన్న విషయాన్ని త్వరలోనే గుర్తిస్తామని పోలీసులు చెబుతున్నారు. మరో షాకింగ్ అంశం ఏమంటే.. ఆదివారం రాత్రి హత్య జరిగిన పిల్లర్ నెంబరు 248కు దగ్గర్లోనే.. ఆదివారం ఉదయం మరో దారుణం వెలుగు చూసింది. పిల్లర్ నెంబరు 222 దగ్గర.. ఒక ఆటో డ్రైవర్ ను దారుణంగా హత్య చేసి.. సూట్ కేసులో కుక్కి.. అక్కడే వదిలేసి వెళ్లారు. ఒకే రోజు రెండు దారుణ హత్యలు ఒకే ప్రాంతానికి దగ్గర్లో చోటు చేసుకోవటం గమనార్హం.