విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘లైగర్’కి కరోనా వల్ల బ్రేకుల మీద బ్రేకులు పడ్డాయి. సినిమా అంతకంతకీ ఆలస్యమవుతూ ఉండటంతో సెకెండ్ వేవ్ తర్వాత స్పీడ్ పెంచాడు పూరి. వరుస షెడ్యూల్స్‌తో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అందుకు సంబంధించిన అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ని వదిలాడు.
విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మాజీ బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పోస్టర్ని దివాలీ గిఫ్ట్‌గా రిలీజ్ చేశారు. ఒకప్పుడు రింగ్‌లోకి పులిలా దిగి.. పిడిగుద్దులతో ప్రత్యర్థుల్ని పరుగులు తీయించిన అరివీర భయంకరుడైన మైక్ టైసన్‌ని మరోసారి గుర్తు చేశారు. ఈ పోస్టర్లో పంచ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు టైసన్. పిడిగుద్దులు గుద్దే ఆయన చేతి నుంచి మంటలు చెలరేగినట్టుగా చూపించడం ఆసక్తిని పెంచుతోంది.
ఇప్పటికే మైక్ టైసన్ పాత్రపై అందరికీ క్యూరియాసిటీ ఉంది. ఆయన కేవలం విజయ్‌కి పోటీ ఇచ్చే బాక్సర్‌గా కనిపిస్తారా.. లేక గురువు పాత్రలో కనిపిస్తారా.. అదీకాక ఆయన పాత్రకి విజయ్‌తో ఏదైనా రిలేషన్ ఉంటుందా అంటూ అంచనాలు వేస్తున్నారు. సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్ కూడా రకరకాల డౌట్స్‌ని క్రియేట్ చేస్తోంది. ఏదేమైనా ఈ సినిమాకి మైక్ టైసన్ పెద్ద ఎసెట్ అనే చెప్పాలి. ఆయన గతంలో ఓ బాలీవుడ్ చిత్రంలో కనిపించారు. ఇప్పుడు ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌తో ఇతర భాషల వారికి కూడా కనువిందు చేయబోతున్నారు. సినిమా స్థాయిని మరింత పెంచేందుకే ఆయనను దించాడు నిర్మాత కరణ్ జోహార్.
విజయ్ కూడా ఈ చిత్రంలోని పాత్ర కోసం కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ నిపుణుల పర్యవేక్షణలోనే యాక్షన్ సీన్స్‌ని కూడా తెరకెక్కిస్తున్నారు. దాంతో సినిమాలో యాక్షన్ ఓ రేంజ్లో ఉండబోతోందని ఊహిస్తున్నారు సినీ జనం. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే యేడు ప్రథమార్థంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.