ఏపీలో నిరుద్యోగులు కొన్నాళ్లు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం.. అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీని నిర్వహించాలని నిర్ణయించింది. నిజానికి మరో నెల రోజులలో ఎన్నిక ల షెడ్యూల్ రానుంది. ఇలాంటి సమయంలో నోటిఫికేషన్ ఇచ్చినా.. ప్రక్రియ ముందుకు సాగడం కష్టం. పైగా.. కీలకమైన ఎన్నికలు కావడం.. సార్వత్రిక సమరం కూడా కలిసి ఉండడంతో సిబ్బంది ఆ విధులకే సరిపోతారు. మెగా డీఎస్సీ ప్రకటనను ఎవరూ పట్టించుకోరు. ఈ విషయం తెలిసి కూడా.. తాజాగా జగన్ నేతృత్వంలోని కేబినెట్ మెగా డీఎస్సీ కి ఆమోదం తెలపడం గమనార్హం.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవీ..
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణ, నోటిఫికేషన్ జారీపై చర్చించారు. సుమారు 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా `వైఎస్సార్ చేయూ త` పథకం నాలుగో విడత నిధులు విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరిలో వైఎస్సార్ చేయూత నిధులు విడుదల చేయనున్నారు.
ఇక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5 వేల కోట్ల మేర `ఆసరా` నిధుల విడుదలకు కూడా జగన్ నేతృత్వంలోని మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ ఆమోదించిన తీర్మానాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ మంత్రిమండలి. విద్యుత్ రంగంలో 22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కూడా పచ్చజెండా ఊపింది. రూ.22,302 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రబుత్వం తెలిపింది.
అదేవిధంగా.. 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ కు ఆమోదం తెలుపుతూ కేబినెట్ ఓకే చేసింది. దాదాపు 12,065 కోట్ల పెట్టుబడితో జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్నారు. ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.